ఉదయం ఉత్సాహంగా ఆఫీస్‌కి వెళ్తారు. కానీ, ఓ గంట వర్క్ చేయగానే అలసటగా అనిపిస్తున్నదా? లంచ్ తర్వాత నిద్ర ముంచుకొస్తున్నదా? పని వేళల్లో అలసిపోతూ.. పూర్తి శక్తితో పనిచేయడం లేదా? అయితే.. మీ డైట్, బ్రేక్స్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే! అప్పుడే మీ 9 నుంచి 5 వర్క్ టైమ్ మరింత సౌకర్యవంతంగా మారుతుంది. స్మార్ట్ డైట్, చిన్నచిన్న బ్రేక్‌లు, మంచి నిద్ర లాంటి అలవాట్లు ఉంటే చాలు. ఆఫీస్ సమయమంతా ఉత్సాహంగా సాగుతుంది. ఉత్పాదకత కూడా పెరుగుతుంది. నిపుణులు చెబుతున్న ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం!
డైట్లో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని పొందవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ కీలకం: ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ రుచితో పాటు, ఆరోగ్యం కూడా ఇవ్వాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంచడానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఉన్న అల్పాహారం తీసుకోవాలి.
నీరు తాగడం: ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకుండా, తరచూ కొద్దిగా సిప్ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉండాలంటే తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. పోషకాలు ఎక్కువగా ఉన్న భోజనం చేయాలి. గ్రిల్ చేసిన కూరగాయలు, పప్పులు లేదా క్వినోవా సలాడ్లు లాంటివి ఉత్తమం.
స్నాక్స్: సాయంత్రాలు స్నాక్స్ సింపుల్‌గా ఉండాలి. పండ్లు, పెరుగు, వేయించిన గింజలు లాంటివి తీసుకుంటే మంచిది. పని వేగం తగ్గదు.. ఇన్‌స్టంట్‌గా శక్తి అందుతుంది. హెర్బల్ టీలు తాగడం కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శరీరానికి శక్తిని అందివ్వడం అంటే.. కేవలం ఆహారం మాత్రమే కాదు. మీ శరీరం కదిలే విధానం కూడా ముఖ్యమే.
గంటగంటకూ: ప్రతి గంటకూ ఒకసారి ఐదు నిమిషాలపాటు పనికి కాస్త బ్రేక్ ఇవ్వండి. కుర్చీలోంచి లేచి.. బాడీ స్ట్రెచింగ్ చేయడం లేదా నడవడం చేయండి. దీనిద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మానసికంగా చురుకుగా ఉంటారు.
సూర్యరశ్మిలో: పని మధ్యలో కొద్దిసేపు బయటికి వచ్చి నిలబడండి. సహజమైన కాంతిలో ఉండటం, కొన్ని బ్రీథింగ్ ఎక్సర్సైజ్ల వల్ల.. శరీరం రీబూట్ అవుతుంది. డెస్క్ వద్ద ఎక్కువ సమయం గడిపేవారు ఈ రీసెట్‌ను తరచుగా మిస్ అవుతారు.
ఉద్యోగులు ఉత్సాహంగా ఉండటం అనేది కేవలం వ్యక్తిగత బాధ్యత కాదు. పని వాతావరణం కూడా ఇందుకు సాయం చేయాలి.
కార్యాలయ మార్పులు: కంపెనీలు తమ ఉద్యోగులు అలసిపోకుండా ఉండటానికి ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తున్నాయి. స్ట్రెచింగ్ కార్నర్లు ఏర్పాటు చేయడం, నడుస్తూ మీటింగ్స్ పెట్టుకోవడం లాంటివి చేయొచ్చు,
మానసిక విశ్రాంతి: కంపెనీలు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆప్షన్లు ఇవ్వాలి. వెల్నెస్ యాప్‌లు, సరైన విధంగా పని భారాన్ని పంచడం చేస్తే.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమతుల్యమైన పని వాతావరణం ఉంటే, టీమ్‌లు మరింత సృజనాత్మకంగా, కలిసి పనిచేసే శక్తిని పొందుతాయి.