Chain Snacher : బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినా చెడు అలవాట్లవల్ల ఓ వ్యక్తి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లడం పనిగా పెట్టుకున్నాడు. ఎప్పటికప్పుడు దుస్తులు మార్చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ వచ్చాడు. దుస్తులు మార్చినా బూట్లు మార్చకపోవడంతో పోలీసులకు చిక్కాడు.
ముంబైలో వరుస దొంగతనాలకు పాల్పడిన చైన్ స్నాచర్‌ను అతడు వేసుకున్న బూట్లే పట్టించాయి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సియాన్ ఏరియాకు చెందిన మోహన్ కొకాటే (49) గతంలో గార్డెనింగ్ వ్యాపారం చేస్తుండేవాడు. అతడి కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. పెద్దపెద్ద హోదాల్లో ఉన్నవారే. మోహన్ మాత్రం ఆన్లైన్ జూదానికి బానిసయ్యాడు. జూదం ఆడేందుకు విపరీతంగా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చైన్ స్నాచర్ అవతారమెత్తాడు.
కొన్ని నేరాల కారణంగా అతడు 2011లో కూడా జైలుకు వెళ్లాడు. బయటికి వచ్చాక కొంతకాలం నేరాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుల కారణంగా మళ్లీ దొంగగా మారాడు. దొంగిలించిన బైక్‌పై తిరుగుతూ మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లేవాడు. ముఖానికి హెల్మెట్ ధరించడం, ఎప్పటికప్పుడు దుస్తులు మార్చడంతో మోహన్‌ను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.
దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లోని 80 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. దొంగతనం జరిగిన ప్రతిచోటా దొంగ వేర్వేరు దుస్తుల్లో కనిపించాడు. అయితే అన్నిచోట్లా ఒకే రకమైన బూట్లు ధరించాడు. ఈ క్లూ ఆధారంగా పరిశోధన జరిపిన పోలీసులు.. దొంగిలించిన బైక్‌ను ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మోహన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.