Allu Cinemas | ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా ఏషియన్ గ్రూప్స్‌తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే అల్లు అర్జున్ ఏషియన్ గ్రూప్‌తో కలసి పలు థియేటర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో అడుగు ముందుకు వేస్తూ “అల్లు సినిమాస్” పేరుతో ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, మరోవైపు మల్టీప్లెక్స్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయిస్తున్నారని సమాచారం. ఈ థియేటర్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
హైదరాబాద్‌లోని కోకాపేట–గండిపేట ప్రాంతాల మధ్య విస్తారమైన ప్రదేశంలో ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద 75 అడుగుల వెడల్పు గల డాల్బీ సినిమా స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారనే వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీప్లెక్స్‌ను మార్చి 19న ఘనంగా ప్రారంభించాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఓపెనింగ్‌కు బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ “ధురంధర్ 2” చిత్రాన్ని ప్రీమియర్‌గా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే “ధురంధర్” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పలు దేశాల్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా “ధురంధర్ 2” వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సీక్వెల్లో ఆర్. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతోనే అల్లు సినిమాస్ ప్రారంభం కావాలని సినీ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం థియేటర్ లోపలి నిర్మాణ పనులు, సీటింగ్ అరేంజ్మెంట్స్ దాదాపు పూర్తయ్యాయని తెలుస్తోంది. అయితే భవనం వెలుపలి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నిర్ణయించిన తేదీ నాటికి మొత్తం నిర్మాణం పూర్తి చేసి గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా అల్లు సినిమాస్ రూపంలో హైదరాబాద్ సినీప్రియులకు మరో అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం దక్కబోతుందనే చర్చ జరుగుతుంది.