చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. ఫ్యాన్సీ క్రీములు వాడుతుంటారు. లేనిపోని ఖర్చులు పెడుతుంటారు. అయితే, వంట గదిలో దొరికే పెరుగు, శనగ పిండితోనే.. వింటర్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా, శీతాకాలంలో వేధించే ట్యానింగ్‌ను బ్యాన్ చేసి.. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.
పెరుగు-శనగపిండి కాంబినేషన్ ఇప్పటిది కాదు. అమ్మమ్మల కాలం నుంచీ ఉన్నదే. పెరుగులో లాక్టిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మ సంరక్షణలో సమర్థంగా పనిచేస్తుంది. ట్యాన్ అయిన చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మాన్ని సహజంగానే ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇక.. శనగపిండి తేలికపాటి స్క్రబ్‌లాగా పనిచేస్తుంది. చర్మంపై పేరుకుపోయే జిడ్డుతోపాటు మృత కణాలు, మలినాలను సంపూర్ణంగా తొలగిస్తుంది.
ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ గడ్డ పెరుగుకు మరో టేబుల్ స్పూన్ శనగపిండిని జోడించాలి. రెండిటినీ మెత్తని పేస్ట్‌లా కలిపి.. ముఖం, మెడ, చేతులతోపాటు ట్యాన్ ఏర్పడిన భాగాలపై బాగా అప్లయి చేయాలి. 15-20 నిమిషాలు అలాగే వదిలేసి.. గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది. సున్నితంగా ఉండే శనగపిండి.. చర్మానికి ఎలాంటి ఇబ్బంది, నష్టం కలిగించదు. పెరుగు.. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మం సాగకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ మిశ్రమానికి చిటికెడు పసుపు కలిపితే.. మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది.