Youtuber | సోషల్ మీడియా వేదికగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. తెలంగాణలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్రం విభాగంలో చదువుతున్న కోమలి, చదువుతో పాటు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే ఆమె తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. ఆమె వీడియోలు యువతలో మంచి ఆదరణ పొందేవి.
అయితే, కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా మరో యూట్యూబర్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అతను సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్‌లో కూడా వీడియోలు చేస్తుండేవాడు. కొంతకాలం సంతోషంగా సాగిన వారి ప్రేమలో విభేదాలు తలెత్తడంతో సుమారు ఏడాది క్రితం ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విభేదాల కారణంగా కోమలి తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పినప్పటికీ, ఈసారి తీవ్ర నిర్ణయం తీసుకోవడం అందరినీ కలచివేసింది.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోమలి మరణానికి ఖచ్చితమైన కారణాలు ఏవో తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారిస్తున్నారు. కోమలి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ప్రేమ వ్యవహారాల్లో వచ్చే విభేదాలు ఎంతటి విషాదాలకు దారితీస్తున్నాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.