Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేం దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సాంగ్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రంలోని రెండో పాటను మార్చి 2న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ పాట ద్వారా హీరో క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రిలీజ్ చేసిన మొదటి రోజే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ సాంగ్, 100 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను దాటుతూ రికార్డులు క్రియేట్ చేసింది.బ్యాట్ పట్టుకుని చరణ్ వేసిన హుక్ స్టెప్‌ను సోషల్ మీడియాలో లక్షల్లో రీక్రియేట్ చేయడం విశేషం. దీంతో రెండో సాంగ్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక మొదట ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేయాల్సి ఉండగా, షూటింగ్ పెండింగ్ పనులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఇప్పుడు సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘మిర్జాపూర్’ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా గ్లింప్స్ ఇప్పటికే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ‘చికిరి చికిరి’తో ట్రెండ్ సెట్ చేసిన ‘పెద్ది’ టీం… ఇప్పుడు రెండో సాంగ్‌తో మరింత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతుందా? అనేది చూడాలి.