మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Jul 23, 2020 , 23:10:55

భవిష్యత్తు.. గ్లోబల్‌ లీడర్‌!

భవిష్యత్తు.. గ్లోబల్‌ లీడర్‌!

తొమ్మిదేండ్ల వయసులో మనమైతే ఏం చేస్తాం? ఏ కార్టూన్‌ చానెలో చూసుకుంటూ కాలక్షేపం చేస్తాం. లేదంటే.. బ్యాట్‌ బాల్‌ తీసుకెళ్లి మైదానంలో తిష్ఠ వేస్తాం. కానీ.. అతను ‘కోడింగ్‌' మొదలుపెట్టాడు. పద్దెనిమిదేండ్లు వచ్చేసరికి ఒక కంపెనీ పెట్టాడు. కట్‌ చేస్తే, తాజాగా ‘గ్లోబల్‌ లీడర్‌ ఫ్యూచర్‌-50’లో స్థానం సంపాదించుకున్నాడు.. రాజేశ్‌కుమార్‌ నల్లా. 

కొమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ రాజేశ్‌. సాంకేతికత పేరే తెలియని మారుమూల ప్రాంతం తనది. కానీ నేడు ప్రపంచం మెచ్చిన ఐటీ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆ ప్రతిభను గుర్తించి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ (పీఎంఐ)  అనే ప్రతిష్ఠాత్మక సంస్థ ఫ్యూచర్‌ గ్లోబల్‌ లీడర్‌-50 జాబితాలో చోటు ఇచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్న వారి జాబితాను ఏటా ప్రకటిస్తుంది ఈ సంస్థ. ఈ ఏడాది ఇండియా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. అందులో, తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు.. రాజేశ్‌.  

ఫ్యూచర్‌-50లో..  

పని.. వ్యక్తులు.. ప్రాజెక్ట్‌లు.. ఉత్పత్తులు.. వనరులు - వీటిపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. వాటిని సమర్థంగా నిర్వహించుకోవడాన్ని  బట్టే సక్సెస్‌ రేటును నిర్ణయిస్తారు.   టెకీమాక్స్‌ ఆ విషయంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటిస్తున్నది. రాజేశ్‌కుమార్‌ నల్లా టెకీమాక్స్‌ ఐటీ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌. గత ఆరేండ్లుగా ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశాడు. యువతలోని  టాలెంట్‌ను గుర్తించి, వారిని పారిశ్రామిక రంగంవైపు ఆకర్షించే  ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ‘స్కిల్‌ లాంచర్‌' అనే వేదికను ఏర్పాటుచేసి, ప్రతీ ఒక్కరిలోనూ వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న రాజేశ్‌, బడికి పెద్దగా వెళ్లేవాడు కాదు. కానీ అన్నీ తెలిసేవి. ఐదో తరగతిలోనే డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకాలు చదివేవాడు. తొమ్మిదేండ్ల వయసులోనే కోడింగ్‌పై పట్టు సాధించాడు. తరచూ పాఠశాలకు డుమ్మాకొట్టే కొడుకును చూసి.. తల్లిదండ్రులు రమాదేవి, తిరుపతి ఆందోళన చెందేవారు. ఇలా అయితే లాభం లేదనుకొని మామయ్య సతీష్‌కుమార్‌ దగ్గరకు పంపారు. అప్పటికే ఆయన దగ్గర కంప్యూటర్‌ ఉండేది. ఇంటర్నెట్‌ సౌకర్యమూ అందుబాటులో ఉండేది. మేనల్లుడి ప్రతిభనూ ఆసక్తినీ గుర్తించి, రాజేశ్‌ ప్రతిభకు  పదును పెట్టారు ఆయన.  తరగతి గదుల్లో సమయం వృథా అవుతుందన్నది రాజేశ్‌ ఆలోచన. అందుకే ఇంటర్‌ కూడా పూర్తిచేయలేదు. పదమూడేండ్లు వచ్చేసరికి ఒక వెబ్‌సైట్‌ను రూపొందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 

 యంగెస్ట్‌ ఆంత్రప్రెన్యూర్‌ 

ఐఐటీలో చదువుకోవాలన్న కోరికతో హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో కోచింగ్‌కి వెళ్లాడు. మూడు నెలలు క్లాసులకు హాజరైన తర్వాత.. ఇదంతా టైమ్‌వేస్ట్‌ వ్యవహారమని అర్థమైపోయింది. గుడ్‌బై చెప్పాడు. అక్కవాళ్లింట్లో ఉంటూ 18 ఏండ్ల వయసులోనే టెకీమాక్స్‌ ఐటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను స్థాపించాడు. అలా ‘యంగెస్ట్‌ ఆంత్రప్రెన్యూర్‌'గా రికార్డులకెక్కాడు. హోదాకు తగ్గట్టు చదువుకూడా అవసరం కావడంతో.. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశాడు. 

గుర్తించాల్సింది నైపుణ్యాన్నే

టెకీమాక్స్‌ ఆధ్వర్యంలో త్వరలో ‘స్కిల్‌ లాంచర్‌' అనే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నాం. నాణ్యమైన, చవకైన విద్య మా లక్ష్యం. ఇదో నెక్ట్స్‌ జనరేషన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌. ప్రతి ఒక్కరిలో ఏదో ఓ నైపుణ్యం ఉంటుంది. దాన్ని వెలికితీయాలన్నదే మా కాన్సెప్ట్‌. ప్రాక్టికాలిటీ ఉంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. నా నైపుణ్యాన్ని చూసే పీఎంఐ ఫ్యూచర్‌-50 లీడర్‌గా గుర్తించింది. 

 -రాజేశ్‌కుమార్‌ నల్లా 


logo