MLA Palla Rajeshwar Reddy | బచ్చన్నపేట, ఏప్రిల్ 11 : హైదరాబాద్లోని స్వగృహంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కొన్నే గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. కొన్నే గ్రామంలోని రెండు ప్రధాన వాగుల పైన కల్వర్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలని, కల్వర్టుల ఏర్పాటుకు ఎమ్మెల్యే పల్లా కృషి చేయాలని కోరారు.
కొన్నే గ్రామంలో పాటిమీద నుండి కొత్తకుంట పోయే దారిలో వాగు మీద కల్వర్టు నిర్మాణం, కొన్నే నుండి పుల్లగూడం పోయే దారిలో వాగు మీద కల్వర్ట్ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని, గ్రామంలో ఉన్న పడమటి చెరువు వర్షపు నీటితో నిండిన లేదా గోదావరి జలాలతో నింపిన ఇట్టి రెండు వాగులు దాటాలంటే రైతుల ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇట్టి రెండు వాగుల పైన కల్వర్ట్ నిర్మాణం చేయించాలని కోరారు. వర్షాకాలం వచ్చిందంటే రైతులు ఈ రెండు వాగులు దాటాలంటే జీవన్మరణ సమస్యగా ఉందని, రైతులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇట్టి సమస్యను పరిష్కరించాలని రైతుల తరఫున కోరుతున్నానని అన్నారు.