టీడీఆర్‌తో ముఖ్య కోటరీ రియల్ గేమ్!
దశాబ్దాలుగా నమ్ముకున్న ఇల్లును రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం కూల్చివేసింది. పరిహారం కింద అధికారులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను చేతిలో పెట్టారు. వాటిని నిర్మాణ రంగ మార్కెట్లో అమ్ముకొని నిర్వాసితులు సొమ్ము చేసుకునే వాళ్లు. ముఖ్యంగా ఎవరుపడితే వాళ్లు బాండ్లను కొని దందాలు చేయకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు టీడీఆర్ తీసుకోవాలంటే దానిని వినియోగించే నిర్మాణం తాలూకు ఆధారాలు చూపాల్సి ఉండేది.
- నిర్వాసితుల నోరు కొట్టి.. బిల్డర్ల జేబులు దోచి
- హైదరాబాద్ నిర్మాణ రంగ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతున్న వైనం
- మార్కెట్లో కృత్రిమ కొరతతో నానాటికీ పెరుగుతున్న బాండ్ల రేటు
- తాజాగా 65-70 శాతంగా కొనసాగుతున్న రేట్లు
- గత రెండున్నర సంవత్సరాలుగా నిలిచిపోయిన కొత్త టీడీఆర్‌ల జారీ
- అదే సమయంలో డిమాండును పెంచుతూ.. సర్కారు వరుస ఉత్తర్వులు
- డిమాండ్ మరింత పెరిగేలా త్రిపుల్ ఆర్ వరకు వినియోగ పరిధి పెంపు
- ఇదో ‘బిగ్’ స్కాం అని గతంలోనే వెల్లడించిన మాజీ మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాలుగా నమ్ముకున్న ఇల్లును రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం కూల్చివేసింది. పరిహారం కింద అధికారులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను చేతిలో పెట్టారు. వాటిని నిర్మాణ రంగ మార్కెట్లో అమ్ముకొని నిర్వాసితులు సొమ్ము చేసుకునే వాళ్లు. ముఖ్యంగా ఎవరుపడితే వాళ్లు బాండ్లను కొని దందాలు చేయకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు టీడీఆర్ తీసుకోవాలంటే దానిని వినియోగించే నిర్మాణం తాలూకు ఆధారాలు చూపాల్సి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలుత టీడీఆర్‌ను కొనుగోలు చేసేందుకు ఉన్న నిబంధనను ఎత్తేసింది. అవసరం ఉన్నా.. లేకున్నా.. బాండ్లను కొనేందుకు ద్వారాలు తెరిచింది.
దీంతో నెలల వ్యవధిలోనే రూ.500-600 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు చేతులు మారాయి. ఈ పరిణామం తర్వాత మార్కెట్లో క్రమంగా బాండ్ల రేటు పెరుగుతూ వచ్చింది. ఒకటీ అరా కాదు… 28-30 శాతం వరకు ఉన్న రేటు ఇప్పుడు ఏకంగా 63-70 శాతం వరకు పెరిగింది. అంటే వంద శాతానికి పైగా.. దీనికి తోడు ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను కూడా పెంచింది. దీంతో గతంలో బిల్డర్లపై ఉన్న భారం కూడా రూ.100 నుంచి రూ.250కి పైగా పెరిగింది. ఆస్తిని కోల్పోయిన నిర్వాసితుడికి అందిన దాని కంటే మధ్య దళారీకి దక్కిందే ఎక్కువ. పైగా ఆ భారాన్ని మోసేది బిల్డర్లు. అంటే నిర్వాసితుల నోరు కొట్టి… బిల్డర్ల జేబులు దోచి… టీడీఆర్ బాండ్ల ముఠా వందల కోట్ల రూపాయల్ని కొల్లగొడుతున్నది.
టీడీఆర్ బాండ్ల ముఠా వందల కోట్లు కొల్లగొడుతుంటే.. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై దళారీల భరతం పట్టాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా దళారీల బేరానికి మరింత గిరాకీ పెంచేందుకు వరుసగా ఉత్తర్వులు ఇస్తున్నది. కారణం… ‘ముఖ్య’నేత కోటరీనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు పద్ధతి ప్రకారం టీడీఆర్ బాండ్ల మార్కెట్‌ను అంచెలంచెలుగా చేజిక్కించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా నిర్మాణ రంగాన్ని కబళించే స్థాయికి చేరుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే… హైదరాబాద్ నగర పరిధిలో ఒక్క టీడీఆర్ బాండ్ అమ్ముడుపోవాలన్నా ఈ కోటరీ కనుసైగలతోనే జరగాలి.
మొన్నటికి మొన్న టీడీఆర్ బాండ్ల డిమాండు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా బాండ్ల వినియోగాన్ని హెచ్ఎండీఏ పరిధి అంటే రీజనల్ రింగు రోడ్డు వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో గత రెండున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నిలిపివేసిన కొత్త టీడీఆర్ బాండ్ల జారీని ఇంకా పునరుద్దరించడం లేదు. ఏండ్ల కిందట నిర్వాసితుల ఆస్తులను సేకరించినా ఇప్పటికీ వారికి పరిహారం కింద టీడీఆర్‌లు జారీ చేయడం లేదు. ఫలితంగా… 70 శాతానికి చేరువలో ఉన్న రేటు డిమాండు మరింత పెరిగి ఇంకెంతకు చేరుతుందోనని నిర్మాణ రంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అసలే హైడ్రా కూల్చివేతలతో కుదేలైన రియల్-నిర్మాణ రంగాలపై ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండు అని ఆ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, ఇతర ప్రాజెక్టులను చేపట్టాలంటే ఆర్థిక భారాన్ని మోయకుండా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే 2012 నుంచి నిర్వాసితులకు పరిహారం కింద టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్ల జారీ విధానాన్ని అమలులోకి తెచ్చారు. నిబంధనల ప్రకారం ఆస్తి కోల్పోయిన వారికి ఎంత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందో అంత విలువైన టీడీఆర్ బాండ్లను జారీ చేస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ దాదాపు 37.32 లక్షల చదరపు గజాల టీడీఆర్ బాండ్లను జారీ చేయగా అందులో 20 లక్షల చదరపు గజాల మేర బాండ్ల వినియోగం పూర్తయింది.
ఇంకా 15.36 లక్షల చదరపు గజాల బాండ్లు జీహెచ్ఎంసీ టీడీఆర్ బ్యాంకులో ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండీఏకు సంబంధించి మరో లక్షన్నర చదరపు అడుగుల మేర బాండ్లు ఆ విభాగం బ్యాంకులో ఉన్నాయి. అయితే కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్ల జారీని నిలిపివేసింది. హైడ్రా చెరువుల పునరుద్ధరణలో అత్యవసరం అనుకున్న ఒకటీ, రెండు చోట్ల మినహా ఈ రెండున్నర సంవత్సరాల్లో బాండ్లు అనేదే బయటికి రాలేదు. ఇదంతా పక్కా ప్రణాళికలో భాగంగా జరిగిందనేది రెండున్నర సంవత్సరాల్లో నిర్మాణ రంగంలో టీడీఆర్ బాండ్ల రేటు పెరగుతుండటంతో అందరికీ అర్థమైంది.
కోటరీ కనుసైగలతో బాండ్ల లావాదేవీలు
2024 ఆదిలో మార్కెట్లో ఉన్న వందల కోట్ల టీడీఆర్‌లను తక్కువ శాతానికి చేజిక్కించుకున్న కోటరీ తరచూ మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించడం ఆనవాయితీగా మారింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం మొదలు జోన్లు, సర్కిల్ కార్యాలయాల వరకు ఏజెంట్లను నియమించుకొని టీడీఆర్ లావాదేవీలను ఈ కోటరీ నియంత్రిస్తున్నది. టీడీఆర్ ఆన్లైన్ సైతం వీరి కనుసైగలతోనే నడుస్తుందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ కోటరీకి చెందిన వారి క్లియరెన్స్ లేనిదే బాండ్లను అమ్మడంగానీ టీడీఆర్‌లతో కూడిన నిర్మాణ దరఖాస్తులకు అనుమతి ఇవ్వడంగానీ చేయడం లేదు. దీంతో కోటరీ చెప్పిందే రేటుగా బాండ్ల లావాదేవీలు కొనసాగుతున్నాయి.
వాస్తవానికి గతంలో ఉన్నట్లుగా హైదరాబాద్ రియల్-నిర్మాణ రంగం దూసుకుపోయినట్లయితే రూ.500-600 కోట్ల విలువైన బాండ్ల విక్రయం ఏనాడో ముగిసేది. కానీ హైడ్రా కూల్చివేతలు… పాలనా తీరు… సర్కారు నిర్ణయాలతో రియల్ రంగం కుదలైపోయింది. నిర్మాణ రంగంలో పాత ప్రాజెక్టులు కొనసాగుతుండటంతో పాటు సాధారణ బిల్డర్లు గతంలో కొనుగోలు చేసిన ప్లాట్లను ఖాళీగా వదిలేయలేక నిర్మాణాలకు పూనుకుంటున్నారు. దీంతో ఆశించిన స్థాయి లో బాండ్ల అమ్మకాలు జరగకపోవడంతో కోటరీ నిరాశ చెందింది. అందుకే ప్రభుత్వం వరుసగా టీడీఆర్‌ల వినియోగాన్ని పెంచేలా జీవోలు ఇస్తూ వస్తుంది.
కొత్తవి లేనట్లేనా?
టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఎలా ఉన్నప్పటికీ.. అందుకోసం ఏండ్ల తరబడి నిర్వాసితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సి వస్తు ంది. గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్‌ల జారీని దాదాపుగా నిలిపివేసింది. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధుల్లో వందల కోట్ల రూపాయల పరిహారం కింద నిర్వాసితులకు ఇవ్వాల్సిన బాండ్లు వారికి ఇంకా అందలేదు. పైగా ఎలివేటెడ్ కారిడార్, మూసీ, మెట్రో ఇలా అనేక ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి.
మరి ప్రభుత్వం గతంలోని వందల కోట్ల బాండ్లను జారీ చేయకుండా… కొత్త ప్రాజెక్టుల ద్వారా ఇవ్వాల్సిన మరిన్ని వందల కోట్ల బాండ్లను ఇవ్వకుండా ఎంత కాలం గడుపుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కోటరీ దగ్గర ఉన్న బాండ్ల విక్రయం పూర్తయ్యే వరకు కొత్తవి జారీ చేయరా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎనిమిది నెలల్లో మూడు జీవోలు
- టీడీఆర్ బాండ్లకు డిమాండు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎనిమిది నెలల్లో ఏకంగా మూడు జీవోలు జారీ చేసింది.
- ఈ ఏడాది జనవరిలో పదంతస్తుల నిర్మాణంలో కచ్చితంగా పది శాతం మేర టీడీఆర్ బాండ్ల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ జీవో 16ను జారీ చేసింది.
- గత మార్చి 21న ప్రత్యేకంగా టీడీఆర్‌లపై ప్రభుత్వం మరో జీవో 95ను జారీ చేసింది. ఇందులో చివరకు 750-2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణాలకూ టీడీఆర్ బాండ్లను తప్పనిసరి చేసిం ది. మరో అడుగు ముందుకేసి… భవన నిర్మాణాల ఉల్లంఘనలకు పాల్పడినా టీడీఆర్ బాండ్లతో వాటిని మాఫీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంటే పది శాతం వరకు ఉల్లంఘనలకు పాల్పడితే (డీవియేషన్స్) బాండ్లు సమర్పించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందేలా జీవో 95లో వెసులుబా టు కల్పించారు. దీంతో సాధారణ నిర్మాణాలు కాకుండా సామాన్య, మధ్యతరగతి బిల్డర్ నుంచి నిర్మాణ సంస్థల వరకు తమ ప్రాజెక్టుల్లో టీడీఆర్ బాండ్లులేనిదే ముందుకుపోలేని పరిస్థితులు కల్పించారు.
- తాజాగా టీడీఆర్ బాండ్ల వినియోగా న్ని జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏ వరకు విస్తరించింది. అంటే రీజనల్ రింగు రోడ్డు వరకు ఉన్న ప్రాంతాల వరకు ఎక్కడైనా, ఎక్కడ జారీ చేసిన టీడీఆర్ బాండ్లనైనా వినియోగించుకునేందుకు శుక్రవారం జీవోను జారీ చేసింది. దీంతో శివారు ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణ ప్రాజెక్టులతో పాటు సాధారణ బిల్డర్లకు టీడీఆర్ అనివార్యంతో పాటు వినియోగానికి అవకాశం కల్పించి డిమాండును మరింత పెంచేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

