ముంబై, సెప్టెంబర్ 21: టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు బోర్డు రూమ్ నుంచి కోర్టు రూమ్ వరకు చేరుతున్నాయి. ఈ నెల 17న మరో ఐదేండ్లు ప్రస్తుత సారథి నటరాజన్ చంద్రశేఖరన్‌కే టాటా సన్స్ లిమిటెడ్ పగ్గాలను అందించాలని కంపెనీ బోర్డు సమావేశంలో మెజారిటీ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని టాటా సన్స్‌లో అత్యధిక వాటా (దాదాపు 66 శాతం) కలిగిన టాటా ట్రస్ట్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నియోల్ టాటా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి విదితమే. బోర్డు నిర్ణయాన్ని అక్రమమని, చట్టవిరుద్ధమని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని తేల్చుకొనేందుకు ఇరు వర్గాలు కోర్టులదాకా వెళ్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ముగియనున్నది. నిజానికి మరోసారి తాను ఈ పదవిలో కొనసాగదల్చుకోవడం లేదని 63 ఏండ్ల చంద్రశేఖరన్ గత నెలలోనే సంస్థ డైరెక్టర్లకు స్పష్టం చేశారు. అయితే బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొనేందుకు ఆయన అంగీకరించారు. ఫలితంగానే మరో ఐదేండ్లు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ బోర్డు తీర్మానం చేసింది. అయినప్పటికీ చంద్ర పునర్నియామకం.. రాబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఆమోదం పొందాల్సి ఉన్నది.
రెండు వైపులా దేశంలోని ప్రధాన న్యాయ సంస్థలు, ప్రముఖ అడ్వకేట్లు, సీనియర్ న్యాయవాదులు రంగంలోకి దిగుతున్నారు. చైర్మన్ పునర్నియామకం, వాటాదారుల హక్కులు, టాటా సన్స్ భవిష్యత్తు అంశాలే కీలకంగా ఈ కేసులో వాదోపవాదాలు జరుగవచ్చని చెప్తున్నారు. టాటా ట్రస్ట్స్ తరఫున సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, టాటా సన్స్ తరఫున అనగ్రమ్ పార్ట్నర్స్ న్యాయ సంస్థలు బరిలోకి దిగుతున్నాయి.
సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, హరీశ్ సాల్వే పరస్పరం ఢీకొనబోతున్నారు. దీంతో న్యాయపరమైన ఖర్చులు ఆయా కంపెనీలపై భారీ ఎత్తునే పడుతాయన్న అంచనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే గతంలో టాటా సంబంధిత కార్పొరేట్ వివాదాల్లో ఖర్చులను టాటా ట్రస్ట్స్ భరించింది. మునుపు సైరస్ మిస్త్రీ వ్యవహారంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ కలిసి రూ.200 కోట్లు చెల్లించాయి. మిస్త్రీ తరఫునవారు సుమారు రూ.50 కోట్లు ఇచ్చుకున్నారు.
అయితే ఇప్పుడు టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్యే రచ్చ జరుగుతుండటంతో న్యాయపరమైన ఖర్చులను ఎవరు చెల్లిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఖర్చుల కోసం ట్రస్ట్స్ ఫండ్స్‌ను వాడటం సరికాదని టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ (టీఈడీటీ)కు చెందిన ట్రస్టీ మెహిల్ మిస్త్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు టాటా ట్రస్ట్స్ చైర్మన్ నియోల్ టాటాతోపాటు, టీఈడీటీ మరో ట్రస్టీ జేఎన్ మిస్త్రీకి ఈ-మెయిల్ కూడా చేశారు. అయితే దశాబ్దాలపాటు రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన మెహిల్ మిస్త్రీ అభ్యంతరం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
చంద్రశేఖరన్ పునర్నియామకం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ టాటా సన్స్ కింద చట్ట విరుద్ధమని ట్రస్ట్స్ చైర్మన్ నియోల్ టాటా అంటున్నారు. చైర్మన్ నియామకం, పునర్నియామకాలకు మెజారిటీ ట్రస్ట్స్ల నామినీ డైరెక్టర్ల ఆమోదం ఉండాలని గుర్తుచేస్తున్నారు. ఇటీవలి టాటా సన్స్ బోర్డు సమావేశంలో టాటా ట్రస్ట్స్ తరఫున ఇద్దరు నామినీలు పాల్గొన్నారు. వారిలో నియోల్ టాటా చంద్రశేఖరన్ పునర్నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ వేణు శ్రీనివాసన్ మద్దతిచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక అధికారాలు కలిగిన చైర్మన్స్ క్యాస్టిం గ్ ఓటును వినియోగించి బోర్డు తీర్మానాన్ని చంద్రశేఖరన్‌కు మద్దతుగా ప్రకటించారు. కంపెనీ అంతర్గత నిబంధనల ప్రకారం ఇది చెల్లదని టాటా ట్రస్ట్స్ వాదిస్తున్నది.