సప్తనదుల సంగమం.. శివలింగ ప్రతిష్ఠాపనకు పాండవులు నిర్ణయించిన ప్రదేశం!
సప్తనదుల సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పాండవులు నిర్ణయించారట. శివలింగం కోసం భీముడిని కాశీకి పంపించారట. ముందే నిర్ణయించుకున్న ముహూర్తం దగ్గరపడుతున్నది. కానీ, భీముడు తిరిగి రాలేదట. ముహూర్తం సమీపించినప్పుడు.. ఓ వేపచెట్టుని నరికి దాని మొద్దుని శివలింగంగా ప్రతిష్ఠించాలని ధర్మరాజు నిర్ణయించాడు.
కరువు బాపవా.. సంగమేశ్వరా!
ప్రపంచంలో ఏడు నదుల సంగమ స్థలి సంగమేశ్వరం ఒక్కటే! సప్తనదులైన తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలాపహరిణి, భీమా, భవనాసి నదులు కలిసే స్థలిని ‘సంగమేశ్వరం’గా పిలుస్తున్నారు. ఈ నదీ ప్రవాహం సోమశిల, శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ పుణ్యక్షేత్రాలను తాకుతూ హంసలదీవి వద్ద సముద్రంలో కలిసిపోతుంది. సోమశిల సమీపంలోని కృష్ణాతీరంలో వేసవిలో మాత్రమే కనిపించే సంగమేశ్వరుడు… కరువు కారణంగా కార్తిక మాసంలోనే భక్తులకు దర్శనమిస్తున్నాడు.

Water Down Temple Sea
వనవాస కాలంలో సప్తనదుల సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పాండవులు నిర్ణయించారట. శివలింగం కోసం భీముడిని కాశీకి పంపించారట. ముందే నిర్ణయించుకున్న ముహూర్తం దగ్గరపడుతున్నది. కానీ, భీముడు తిరిగి రాలేదట. ముహూర్తం సమీపించినప్పుడు.. ఓ వేపచెట్టుని నరికి దాని మొద్దుని శివలింగంగా ప్రతిష్ఠించాలని ధర్మరాజు నిర్ణయించాడు. మిగిలిన పాండవులు భీముడి కోసం ఎదురుచూడకుండా ధర్మరాజు చెప్పినట్టే ఓ వేపచెట్టు మొద్దుని శివలింగంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ముమూర్తం దాటిపోయిన తర్వాత భీముడు వచ్చాడట. తను తెచ్చిన లింగాలు నిరుపయోగమయ్యాయని వాటిని కోపంతో విసిరేశాడట. ఆ లింగాలు సంగమేశ్వరంతోపాటు మల్లేశ్వరం, అమరగిరేశ్వరం, కపిలేశ్వరం, సిద్ధేశ్వరంలో పడినట్లు పురాణ కథలు చెబుతున్నాయి.

Shivalinga
చాళుక్యుల చాతుర్యం
ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన ఈ సంగమేశ్వరాలయాన్ని 9వ శతాబ్దంలో బదామి చాళుక్యులు నిర్మించారు. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించిన వేపదారు లింగం నేటికీ చెక్కుచెదరలేదు! అందుకే ఈ లింగం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తున్నారు. గర్భగుడిలో కొలువైన సంగమేశ్వరుడి వెనుక ఎడమ వైపు శ్రీలలితాదేవి, కుడి దిక్కున గణేశుడి విగ్రహాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. ఒకప్పుడు శ్రీశైలం ఆలయంలో కంటే సంగమేశ్వర ఆలయంలోనే శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగేవట. కాలక్రమంలో ఈ ఆలయం అత్యంత సాదాసీదాగా మారిపోయింది. ముఖ మంటపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే భక్తుల దర్శనానికి అనువుగా మిగిలాయి.

People Visit Temple
గంగను చేరిన శివుడు
శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం సప్తనదుల సంగమంలో మునిగిపోయింది. సంగమేశ్వర ఆలయం ఏడాదిలో దాదాపు 8 నెలలు నీటిలో మునిగి ఉంటుంది. నదీ జలాల మట్టం తగ్గినప్పుడు ఓ నాలుగు నెలలు ఆలయం బయల్పడుతుంది. అప్పుడే భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరుతూ, గర్భ గుడిలోకి నీళ్లొచ్చే సమయానికి సంగమేశ్వరుడికి చివరి పూజలు చేస్తారు. ఆలయం మళ్లీ తెరుచుకున్నాక హోమాలు, పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా ఫిబ్రవరి మాసం తర్వాత గానీ సంగమేశ్వర ఆలయం బయల్పడేది కాదు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, కరువు వెంటాడుతుండటం, శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ తగ్గిపోవడంతో చాలా ముందుగానే ఆలయం బయటికి తేలింది. సెప్టెంబర్ 17వ తేదీన ఆలయ శిఖరం కనిపించగా.. అక్టోబర్‌లో ఆలయం సగం కంటే ఎక్కువభాగం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి అర్చకులు, భక్తులు పూజలు చేస్తున్నారు. నవంబర్ 6వ తేదీన ఆలయ గర్భగుడి నుంచి నీరు పూర్తిగా తొలగిపోయింది. కార్తిక మాసంలో సంగమేశ్వరుడు దర్శనం ఇవ్వడం చాలా అరుదు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత కార్తిక మాసంలో సంగమేశ్వర ఆలయ దర్శనం ఇది రెండోసారి. భక్తులు గర్భగుడిలోని వేపదారు లింగాన్ని ఈ ఏడాది ముందుగానే దర్శించుకుంటున్నారు. కార్తిక మాసం శివారాధకులకు అత్యంత పవిత్రమైనది. కార్తిక సోమవారాలు, పౌర్ణమికి జరిగే ప్రత్యేక పూజల్లో వేపదారు లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. కష్టమొస్తే దేవుడి దగ్గరికి చేరుకునే భక్తులు వానలు కురిపించమని, పంటలు పండించమని, కరువుని పోగొట్టమని ఆ సంగమేశ్వరుడిని వేడుకుంటున్నారు.

Temple In The River
ఇట్ల పోవాలె..
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా.. ఏపీలోని కర్నూల్ జిల్లా సరిహద్దులో పారుతున్న కృష్ణానది ఒడిలో సంగమేశ్వర ఆలయం ఉన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం, సోమశిల గ్రామానికి హైదరాబాద్‌కు దాదాపు 180 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా లేదా షాద్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మీదుగా సోమశిలకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి కృష్ణానదిలో మరబోట్లు లేదా పడవల్లో 2 కిలోమీటర్లు ప్రయాణించి సంగమేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు.
– తోషకాని ప్రదీప్, నాగర్‌కర్నూల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

