న్యూఢిల్లీ : భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నిర్దేశించిన పురుగుమందుల అవశేషాల పరిమితిని మించిన పండ్లు, కూరగాయల నమూనాలు దేశంలో అత్యధికంగా తెలంగాణలో నమోదయ్యాయి. ఇక్కడ 8,198 నమూనాలలో 486 నమూనాల్లో అనుమతించదగిన స్థాయికంటే ఎక్కువగా అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్లో 2,104 నామూనలకు గాను 134 పరిమితిని మించాయి. 2023-2026 మధ్యకాలానికి సంబంధించి నమోదైన వివరాలను లోక్సభలో వెల్లడించారు.
కర్ణాటకలో 9,176 నమూనాల్లో 334 నమూనాలు (3.6 శాతం) ఈ పరిమితిని మించి రెండవ స్థానంలో నిలిచాయి. మహారాష్ట్రలో పరీక్షించిన 5,298 నమూనాల్లో 260(4.9 శాతం) పరిమితికి మించాయి. దేశవ్యాప్తంగా 2023-2026 మధ్యకాలంలో 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 70,652 పండ్లు, కూరగాయల నమూనాలను సేకరించి, పరీక్షించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. వీటిలో 2,223 నమూనాల్లో నిర్దేశించిన గరిష్ఠ అవశేష పరిమితుల కంటే ఎక్కువ పురుగుమందులు అవశేషాలు కనిపించాయి.