కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఆగస్టు 14 : వరుసగా చైన్ స్నాచింగ్‌లు, బైక్ దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు వెల్లడించారు. పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపహాడ్, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చండ్రుగొండ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన వరుస చోరీ కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడైన సున్నం నాగేంద్రబాబు అలియాస్ నాగేంద్ర తన సహచరులతో కలిసి రాత్రివేళల్లో ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు.
బంగారు గొలుసులను ఎలక్ట్రిక్ వైర్ కట్టర్‌తో కట్ చేసి క్షణాల్లోనే బైక్‌లపై పారిపోయేవారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ముందుగానే బైక్‌లను దొంగిలించి, వాటిని తదుపరి నేరాలకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. చోరీ చేసిన సొత్తును నిందితులు తమ వద్ద ఉంచుకోకుండా ముఠాకు సహకరిస్తున్న మహిళల వద్ద దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల విచారణలో దమ్మపేట, బూర్గంపహాడ్, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 10 కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభించడంతో విచారణను వేగవంతం చేసి, నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ముఠాలో ప్రధాన అంతర్రాష్ట్ర నిందితుడైన నాగేంద్రబాబు అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. ఇతడిపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 83 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
నాగేంద్రతోపాటు వల్లూరి శాంతరాజు అలియాస్ రాజు, ఊకే భద్రం అలియాస్ వీరభద్రం, బెత్తి కార్తీక్, ఊర లింగయ్య, బెత్తి ఆదిలక్ష్మి, కల్లూరి లావణ్య, అల్లం సారమ్మ అలియాస్ సర్లమ్మను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో రాజుపై 11, లింగయ్యపై 12 దొంగతనం కేసులు ఉన్నాయని, ఈ కేసుల్లో మరో నిందితుడైన ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి బాలవీరస్వామి పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.26 లక్షల విలువ చేసే 150 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరుస చైన్ స్నాచింగ్ కేసులను సమర్థవంతంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు భారీ మొత్తంలో సొత్తు రికవరీ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, ఎస్సైలు రాజేశ్‌కుమార్, యయాతి రాజు, బాలస్వామినాథం, దేవ్‌సింగ్, పీఆర్వో బొల్లి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.