గురువారం 04 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:44:52

ఊర్లకు పోయేందుకు ఉర్కులాట

ఊర్లకు పోయేందుకు ఉర్కులాట

  • హెల్ప్‌లైన్‌ నంబర్లకు వలసకార్మికుల వరుస ఫోన్లు
  • టీఎస్‌ పోలీస్‌పోర్టల్‌కు దరఖాస్తుల వెల్లువ

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్వస్థలాలకు వెళ్లాలనే కోరికను నలభైరోజులుగా అణుచుకున్న ఇతర రాష్ర్టాలవారు ఇప్పుడు ఊర్లకు పో యేందుకు ఉర్కులాడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణం గా ఉపాధి కోల్పోయిన కార్మికులతోపాటు, ఇతర రా ష్ర్టాలనుంచి వచ్చి చిక్కుకుపోయినవారుసైతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వలసకూలీల సాకుతో ఇతరులు కూడా స్వస్థలాలకు పయనమవుతుండటంతో సరిహద్దుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతోపాటు, ఇతర ప్రాం తాల నుంచి సొంతకార్లు, వాహనాల్లో తెలుగురాష్ర్టాలకు వస్తున్నవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో సరిహద్దుల్లో వాహనాలు బారులుతీరాయి. వలసకూలీల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లు మారుమోగుతున్నాయి. మూడురోజుల్లోనే హైదరాబాద్‌ జిల్లాలో 2,500 మంది హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించారు. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌తోపాటు కర్ణాటక, ఏపీకి చెందిన 87వేల మంది వలసకూలీలు ఉన్నట్టు డీఆర్‌వో అనిల్‌కుమార్‌ తేల్చారు.

ఇతర రాష్ర్టాలకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు

రాష్ట్రం నుంచి ఇతరరాష్ర్టాలవారు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ పోలీసులు ఈ-పాస్‌లు జారీచేస్తున్నారు. ఒక్కరోజులోనే 12వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో 7,749 మందికి ఈ-పాస్‌లు జారీచేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్‌కు ఒక్కరోజులోనే లక్షా20వేల హిట్స్‌ వచ్చినట్టు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ వీలైనంత త్వరగా ఈ-పాస్‌లు జారీచేస్తున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. 

సరిహద్దుల్లో బారులు

వలసకార్మికుల సాకుతో స్వగ్రామాలకు వెళ్లేందుకు కార్లు, ప్రైవేటువాహనాల్లో వస్తున్నవారిని సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటుగా ఒడిశాకు వెళ్లేవారిని ఏపీ సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. తెలంగాణ అనుమతిపత్రాలు చెల్లవని, ఏపీ అనుమతిపత్రం కా వాలంటూ అడ్డుకొంటున్నారు. కర్నూలు నుంచి తెలంగాణలోకి రాకుండా పోలీసులు ఏర్పాట్లుచేశారు. విజయవాడ గరికపాడు చెక్‌పోస్టు దగ్గర సరైన పత్రాలతో వలసకూలీలున్న నాలుగు బస్సులనే ఏపీలోకి అనుమతించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి ఏపీ, ఒడిశాలకు ఏడు వాహనాల్లో తరలిస్తున్న 150 మంది వలసకూలీలను అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద ఏపీ అధికారులు అడ్డుకున్నారు.  కుమ్రంభీ ఆసిఫాబాద్‌ జిల్లాలో వివిధరాష్ర్టాలకు చెందిన మొత్తం 1,639 మంది వలసకూలీలు ఉన్నట్టు  గుర్తించారు. ఇతర రాష్ర్టాలకు తరలుతున్న వలసకూలీల వాహనాలు జిల్లామీదుగా వెళ్తుండటంతో ఆదిలాబాద్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.  

వలసకూలీలకే అనుమతి: ఏపీ 

ప్రయాణాలతో కరోనా వ్యాప్తిచెందే అవకా శం ఎక్కువగా ఉంటుందని, పొరుగురాష్ర్టాల్లో ఉ న్నవారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. వలసకూలీలకు మాత్రమే అ నుమతి ఉన్నదని చెప్పారు. ఇతరులు సరిహద్దులకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.  


logo