శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 02:34:04

పైడికంటె ఉంటే..పైసలొస్తయట!

పైడికంటె ఉంటే..పైసలొస్తయట!

  • కిస్మత్‌ మారుతుందంటూ ప్రచారం 
  • దిష్టి తీయించుకున్నా డబ్బే డబ్బు
  • అమ్మకానికి గుడ్లగూబలు 
  • అమాయకులకు ఆగంతకుడి గాలం
  • పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

చార్మినార్‌: మీరు ఎంత కష్టపడ్డా బర్కత్‌ ఉంటలేదా? మీ కిస్మత్‌ మారి కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నదా.. మీ అదృష్టం పండాలంటే చిన్నపాటి పరిహారం చేస్తే చాలు.. పైసలే పైసలు అంటూ ప్రచారం ప్రారంభించాడో వ్యక్తి! ఏమిటా పరిహారం.. ఇంతకు ఆ చిట్కా ఏంటి? అని అందరూ ఎగబడ్డారు. పైడికంటెను మీ ఇంట్లో ఉంచుకోండి.. లక్ష రూపాయలిస్తే నేను తెచ్చిస్తానని చెప్పాడు.. అంత డబ్బులేదంటే ఓ ఐదువేలివ్వండి పైడికంటె      (గుడ్లగూబ)తో దిష్టితీస్తానన్నాడు. రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోవాలనుకున్న వారంతా సదరు వ్యక్తి ఇంటి ముందు క్యూ కట్టా రు. రూ.10 వేలకు ఓ పైడికంటె అమ్మడాన్ని ప్రారంభించిన వ్యక్తి డిమాండ్‌ పెరుగడంలో ఒక్కోదానిని రూ.లక్షకు అమ్మాడు. విషయం ఆ నోటా ఈ నోటా దక్షిణమండలం పోలీసులకు చేరింది.

సీన్‌ కట్‌ చేస్తే సదరు వ్యక్తి కటకటాల పాలయ్యాడు. తీగలకుంటలోని గుడీకా దవాఖాన ప్రాంతంలో నివసించే కమ్రాన్‌ అలీ ఫారూఖీ అలియాస్‌ ఇమ్రాన్‌ (22) కొన్నేండ్లుగా చార్మినార్‌ సమీపంలోని ముర్గీచౌక్‌లో పక్షుల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. డిమాండ్‌ మేరకు కొన్ని రకాల పక్షులను నల్లమల అటవీప్రాంతం నుంచి తెచ్చి అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో పైడికంటెలను పట్టి అధిక ఆదాయం పొందేందుకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. పైడికంటెలు, వాటి గుడ్లు దగ్గర ఉంటే చేపట్టిన ప్రతి పనీ విజయవంతమవుతుందని ప్రచారం చేశాడు. ఒక్కో పైడికంటెను రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్మసాగాడు.

ఆర్థిక స్థోమత లేని వారికీ మరో ఆఫర్‌ కూడా ఇచ్చాడు. పైడికంటెతో దిష్టితీస్తూ.. రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసేవాడు. విషయం తెలుసుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అటవీశాఖ అధికారులతో కలిసి కమ్రాన్‌ ఫారూఖీ ఇంటిపై దాడి చేశారు. గోధుమ రంగులో ఉన్న 15 పైడికంటెలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అటవీశాఖ అధికారులకు అప్పగించినట్టు డీసీపీ గుమ్మీ చక్రవర్తి తెలిపారు.


logo