BHA | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: మనం కొత్తగా షూ లేదా చెప్పులు కొన్నప్పుడు గమనిస్తే.. వాటిపై యూకే/యూరోపియన్ లేదా యూఎస్ సైజులు రాసి ఉంటాయి. చెప్పులపై ఇండియన్ సైజు ఎందుకు ఉండదనే అనుమానం చాలామంది వస్తూ ఉంటుంది. మనం యూకే సైజును పరిగణనలోకి తీసుకోవాలా? యూఎస్ సైజులో కొనాలా? అనేది కూడా గందరగోళమే. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం రాబోతున్నది. భారతీయుల పాదాలకు తగ్గట్టుగా త్వరలోనే చెప్పుల కొలతలకు కొత్త విధానం అందుబాటులోకి రానున్నది. భారత్ పదంలోని మొదటి అక్షరం ‘భా’ (BHA) అని ఈ కొత్త కొలతల విధానాన్ని పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా 79 ప్రాంతాల్లో 1,01,880 మందిపై చెన్నైకు చెందిన సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎస్ఐఆర్ – సీఎల్ఆర్ఐ) ఒక సర్వే జరిపి ఈ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ)కి ప్రతిపాదించింది. ఈ సర్వే కోసం 3డీ స్కానింగ్ యంత్రాలను వినియోగించి సగటు భారతీయుల పాదాల కొలతలు, పరిణామం, నిర్మాణాన్ని తెలుసుకున్నారు. భారతీయుల పాదాలు యూరోపియన్లు, అమెరికన్ల పాదాల కంటే వెడల్పుగా ఉన్నాయని గుర్తించారు. యూకే, యూఎస్ సైజుల్లో సరైన పాదరక్షలు లభించడం లేదని, ఎక్కువ మంది ఇరుకైనవి, పొడవైనవి ధరిస్తున్నారని తేల్చారు.
మన దేశంలో స్వాతంత్య్రానికి ముందు బ్రిటిషర్లు యూకే సైజుల విధానాన్ని తీసుకురాగా, ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. ఇప్పుడు కొత్త విధానంలో అన్ని వయసుల వారికి సరిపోయేలా కేవలం ఎనిమిది సైజులు ఉంటే సరిపోతుందని సీఎల్ఆర్ఐ ప్రతిపాదించింది. పిల్లలకు, మహిళలకు, పురుషులకు వేర్వేరు సైజులు ఉండవు. ఏడాది లోపు పిల్లలకు ఒకటో సైజు, ఏడాది నుంచి మూడేండ్ల లోపు పిల్లలకు రెండో సైజు, నాలుగు నుంచి ఆరేండ్ల వయసు వారికి మూడో నంబరు సైజు, ఏడు నుంచి 11 ఏండ్ల వారికి నాలుగో నంబరు సైజు వస్తుంది. 12 – 13 ఏండ్ల అమ్మాయిలకు ఐదో నంబరు సైజు, 12 – 14 ఏండ్ల అబ్బాయిలకు ఆరో నంబరు సైజు సరిపోతుంది. 14 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు మహిళలకు ఏడో నంబరు సైజు, 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు పురుషులకు ఎనిమిదో నంబరు సైజు వస్తుంది. 85 శాతం భారతీయులకు ఈ సైజులే సరిపోతాయని సీఎల్ఆర్ఐ చెప్తున్నది.