మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:18:56

రిజిస్ట్రేషన్ల రికార్డు

రిజిస్ట్రేషన్ల రికార్డు

  • సోమవారం అత్యధికంగా నమోదు
  • ఈ ఆర్థిక ఏడాదిలోనే అత్యధికం
  • రెండునెలల్లో 75 వేలు దాటిన ధరణి రిజిస్ట్రేషన్లు
  • పది రోజుల్లో 66 వేల వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు 

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. సోమవారం ఒక్కరోజే అటు ధరణి ద్వారా తాసిల్దార్‌ కార్యాలయాల్లో, ఇటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రికార్డుస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి 8,200 దస్తావేజులు రిజిస్టర్‌ కాగా, వ్యవసాయ భూముల కోసం బుక్‌ అయిన 1,838 స్లాట్ల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. ధరణి ప్రారంభమైన రెండు నెలల్లో 75 వేల వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లు జరుగగా, గత నెల 21 నుంచి 66 వేల వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 

హైదరాబాద్‌/ప్రత్యేక ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ): వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా సోమవారం జరిగాయి. ఒక్కరోజే 8,200 స్థిరాస్తుల దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కాగా, దాదాపు రూ.28 కోట్ల ఆదాయం వచ్చింది. వారం రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తిరిగి ప్రారంభమైన డిసెంబర్‌ 21న నుంచి 66 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా, సుమారు 650 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 2019 డిసెంబర్‌ నెలాఖరు నాటికి 12.66 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కాగా, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ రుసుం రూపంలో రూ. 5,232 కోట్ల రాబడి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే (2020 మార్చి 31) నాటికి 16.59 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కాగా, రూ.7,062 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ, 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే కరోనా వైరస్‌ రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గత ఏడాదిలో సగం ఆదాయం కూడా రాలేదు. 2020 డిసెంబర్‌ ఆఖరు నాటికి రూ.2,410 కోట్లు మాత్రమే వచ్చింది. 

ఒక్కసారిగా జోరు..

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ నిబంధనలను ప్రభు త్వం సడలించడంతో డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. డిసెంబర్‌ 21 నుంచి రెగ్యులర్‌ ప్లాట్లు, 29వ తేదీనుంచి ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌లేని ప్లాట్లకు, భవనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఒక్కసారిగా స్థిరాస్తి లావాదేవీలు పెరిగాయి. వాస్తవానికి సాధారణ పరిస్థితుల్లో ప్రతిరోజూ 5 నుంచి 6 వేల వరకు, నెలకు 1.20లక్షల 1.60లక్షల వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతాయి. రూ. 520 కోట్ల నుంచి రూ.720 కోట్ల రాబడి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నందున రిజిస్ట్రేషన్లలో వేగం పుంజుకుంటున్నాయి. వచ్చే మూడు నెలల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు రికార్డుస్థాయిలో జరిగే అవకాశం ఉన్నదని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ శేషాద్రి తెలిపారు.


విజయవంతంగా ధరణి 

అవినీతిరహిత, సులభతరమైన భూ లావాదేవీలే లక్ష్యంగా ధరణి పోర్టల్‌ విజయవంతంగా నడుస్తున్నది. రెండునెలల్లోనే 75 వేల వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ధరణి పోర్టల్‌ను అక్టోబర్‌ 29న సీఎం కేసీఆర్‌ ప్రారంభించగా.. నవంబర్‌ రెండునుంచి రాష్ట్రవ్యాప్తంగా మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. నాటినుంచి ఈ నెల 2వ తేదీ వరకు 75,291 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. సగటున రోజుకు 1,200కుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. సోమవారం రికార్డుస్థాయిలో 1,838 రిజిస్ట్రేషన్లు జరుగగా, 2,073 స్లాట్లు బుక్‌ అయ్యాయి. నాలా కన్వర్షన్‌కు 1,500 దరఖాస్తులు రాగా.. 1,359 పూర్తయ్యాయి. ధరణిలో ఒక్కో ఆప్షన్‌కు అనుమతినిస్తూ ప్రభు త్వం పోర్టల్‌ను విస్తృతం చేస్తున్నది.

ఒక్క రోజే

8,200 : వ్యవసాయేతర ఆస్తులు

1,838: వ్యవసాయ భూములు

2,703 : స్లాట్లు బుకింగ్‌


logo