భోపాల్: కిడ్నీలు విఫలమై మృత్యువు అంచున ఉన్న కొడుకును చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వృద్ధురాలైనప్పటికీ లెక్కచేయక కిడ్నీ దానం చేసి కుమారుడి ప్రాణాలు కాపాడింది. మాతృ దినోత్సవం రోజున (Mother’s Day) ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల వ్యక్తికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు.
కాగా, మృత్యువు అంచున ఉన్న కుమారుడి బాధను చూడలేక 66 ఏళ్ల వయస్సున్న అతడి తల్లి తల్లడిల్లిపోయింది. తన వయసును కూడా లెక్కచేయకుండా కిడ్నీని దానం చేసి కుమారుడ్ని బతికించుకోవాలని నిర్ణయించింది. జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన ల్యాప్రోస్కోపిక్ టెక్నిక్ సహాయంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. చాలా ఖర్చుతో కూడుకున్న కిడ్నీ మార్పిడి సర్జరీ ఆయుష్మాన్ పథకం ద్వారా సాధ్యమైంది.
మరోవైపు వృద్ధురాలైన తల్లి కిడ్నీ దానం చేయడంతో ఆమె కుమారుడి ప్రాణాలు దక్కాయి. వారిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కిడ్నీ ఇచ్చి కుమారుడికి ప్రాణ దానం చేసిన మాతృమూర్తి ప్రేమను వారు కొనియాడారు.