Supreme Court | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్‌ని సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే చట్టపరమైన హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాంతి భాటీ అనే వ్యక్తి ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పదవిలో కొనసాగాలా? వద్దా? ఆయన వ్యక్తిగత విషయమని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఏదైనా తీవ్రమైన పరిస్థితులుంటే ఎల్జీ వీకే సక్సేనా చర్యలు తీసుకుంటారన్న కోర్టు.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, అరెస్టు తర్వాత సైతం ఆయన పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల ఆయనకు సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. జూన్ 2న జైలులో మళ్లీ లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.