Ramaayanam | మా పాత ఇల్లు ఓ చతుశ్శాల భవంతి. ఆ ఇంటి వాకిలికి ఎడం పక్కన జగిలి ఉండేది. నేల కంటే ఒక మెట్టు ఎత్తులో చదునుగా ఉండే వరండాలాంటి పూరిపాక అది. మూడుపక్కలా గోడలతో.. ఒక వైపు ఓపెన్‌గా ఉండేది. అందులో నేల చెమ్మ తగలకుండా రాళ్లపై ఉంచిన ఆరు గుమ్ములు ఉండేవి. వాటిలో వడ్లు ఉంచి, పైన వరిగడ్డి వేసి పేడతో సీల్ చేసేవారు. అవేకాకుండా నాలుగు మట్టి గాబులు కూడా ఉండేవి. వాటిలో వేరుశనగ, మక్కజొన్నలు, కందులు, పెసలు లాంటివి నిలువ చేసేవారు.
అమ్మకు మొక్కలంటే ఇష్టం. పెరటి నిండా పెంచేది. రోజూ సాయంత్రం బావిలోంచి చేది.. ఎన్ని బిందెల నీళ్లు పోసేదో! మొక్కలూ, చెట్లూ పచ్చగా కళకళలాడుతూ ఉండేవి. జామ, రేగు, అవిసె, దానిమ్మ, సపోటా, బాదంలాంటి చెట్లతోపాటు ఇప్పుడు డ్రై ఫ్రూట్‌గా బాగా అమ్ముడుపోతున్న అంజీరా చెట్టుకూడా మా పెరట్లో ఉండేది. ఇక పూల మొక్కలైతే లెక్కేలేదు. మల్లెల్లో ఎన్ని రకాలున్నాయో.. అన్నీ మా పెరట్లో ఉండేవి. గన్నేరు, నందివర్ధనం, చేమంతి, కనకాంబరం, లిల్లీ, గులాబి, మందార, జాజి సరేసరి.
వాకిలికి కుడిపక్క పశువుల దొడ్డి.. బయటినుంచి పశువులు వచ్చేందుకు వేరే పాటక్ (గేట్) ఉండేది గానీ, ఎందుకో వాటిని వాకిట్లో నుంచే తోలుకుపోయేవారు. పశువులు ఇంటికి వచ్చే సమయానికి నాన్న తప్పకుండా అరుగు మీద కూర్చుని.. ఒక్కొక్క పశువునూ చూసుకునేవాడు. ‘గీ మచ్చల ఆవు కుంటుతున్నదేంది? గా ఎద్దు కంట్లె నుంచి నీరు కారుతున్నదెందుకు?’ అని తెలుసుకుంటూ.. ఒక్కోదాని మూపురం నిమురుతూ పలుకరించేవాడు. అవి మోరలెత్తి ఆనందం ప్రకటించేవి. దుందుడుకు కోడె లేగలు మటుకు.. ‘ఇంతదూరం తిరిగి పోవుడేంది? బ్రేక్ ద రూల్స్’ అనుకుని ఆ పాటక్ మీదినుంచే ఎగిరి దొడ్లోకి దూకేవి. అవి అట్లా ఎగురుతుంటే చూడ్డం నాకు మహా ఇష్టం. మా చిన్నప్పుడు ఆ దొడ్డి నిండా కోడె లేగలు, ఎద్దులు, దున్నపోతులు.. ఇలా చాలా పశువులు ఉండేవి. ఇవి కాకుండా పాలిచ్చే బర్రెలకూ, ఆవులకూ ప్రత్యేకంగా పొడవాటి కొట్టం ఉండేది. వాటికోసం కుడితి గోలేలూ, గడ్డి తొట్టెలూ ఉండేవి. పశువులకు చిన్న గాయాలైతే జీతగాళ్లే పసుపూ నూనె కలిపి రాసేవారు. జబ్బు చేస్తే నాటు వైద్యుడు వచ్చేవాడు. పెద్ద మీసాలతో, బుగ్గన పులిపిరితో.. అచ్చం
సినిమాల్లో యమధర్మరాజులా ఉండేవాడు. అతణ్ని చూస్తే చాలు నేను భయపడి లోపలికి పరిగెత్తేదాన్ని. ఇక పశువులకు మందు తాగించడమైతే.. ఓ ప్రహసనంలా సాగేది. జీతగాళ్లు పశువు ముందు రెండు కాళ్లూ, వెనుక రెండు కాళ్లనూ కట్టేసి, కింద పడేసి గట్టిగా పట్టుకునేవాళ్లు. ఆ నాటు వైద్యుడు రంగంలోకి దిగి, తను తెచ్చిన మందును ఓ బకెట్ నీళ్లలో కలిపి.. వెదురు గొట్టంతో పశువు నోట్లో పోసేవాడు. ఇంకా ఘోరం ఏమిటంటే.. కొన్నిసార్లు ఎర్రగా కాలుతున్న నిప్పుల్లో ఇనుప గడ్డ
పారను కాల్చి.. కట్టి పడేసిన పశువుకు వాత పెట్టేవాడు. అది అరిచే అరుపులకు నేనూ, అక్కా లోపల్నుంచి కెవ్వుమనేవాళ్లం. ఇంత చేసినా ఒక్కోసారి పశువు చచ్చి
పోయేది. ఓ బలమైన కర్రకు పశువు నాలుగు కాళ్లూ కట్టేసి.. తలకిందులుగా వేలాడదీసి దాన్ని మోసుకెళ్లేవాళ్లు. ఆ రోజు నాన్న అన్నం కూడా తినకుండా చాలా బాధపడేవాడు. అది ఎప్పుడు పుట్టిందో, గంతులేస్తూ ఎంత చురుగ్గా ఉండేదో, ఒంటి మీద ముల్లుగర్ర పడకుండా ఎంత పని చేసేదో.. పదేపదే చెబుతూ ఉండేవాడు. మాకూ చాలా బాధేసేది. ఆ తరువాత రోజుల్లో నాన్నే పశువుల వైద్యశాల ఊరికి రావడానికి చొరవ తీసుకున్నారు. అందరికంటే ముందు నాటువైద్యం మానేసి, పశువులను ప్రభుత్వ పశువైద్యశాలకు పంపడం మొదలుపెట్టాడు. ఇంట్లోనుంచి మాత్రమే కాకుండా వాకిలి రెండు పక్కలా ఇంటి వెనక్కి వెళ్లడానికి దారులు ఉండేవి. పశువుల కొట్టం వైపు వెళ్తే.. వెనక రెండు పెద్ద చింతచెట్లు ఉండేవి. అటువైపు మళ్లీ ఇంకో దిడ్డి దర్వాజా ఉండేది. అటు ప్రహరీకి ఉన్న చిన్న దారిలోంచి వెళ్తే.. వెనుక దాదాపు ఎకరం చెల్క ఉండేది. అందులో మక్కజొన్న, పల్లీలు పండేవి. అక్కడ మోటబావికి రబ్బరు తొండం అమర్చి, ఎడ్లతో మోట కట్టి నీళ్లు పెట్టేవాళ్లు. మోటబావి వెనుకే కుమ్మరి వాళ్ల ఇండ్లు ఉండేవి. వాళ్లు సారె మీద కుండలు చేస్తుంటే.. మేము అబ్బురంగా చూసేవాళ్లం. అమ్మకు మొక్కలంటే ఇష్టం. పెరటి నిండా పెంచేది. రోజూ సాయంత్రం బావిలోంచి చేది.. ఎన్ని బిందెల నీళ్లు పోసేదో! మొక్కలూ, చెట్లూ పచ్చగా కళ కళలాడుతూ ఉండేవి. జామ, రేగు, అవిసె, దానిమ్మ, సపోటా, బాదంలాంటి చెట్లతోపాటు ఇప్పుడు డ్రై ఫ్రూట్‌గా బాగా అమ్ముడుపోతున్న అంజీరా చెట్టుకూడా మా పెరట్లో ఉండేది. దాని సంగతి తెలియక.. ‘ఏందో చప్పచప్పగ ఉన్నయ్. వీటిని పండ్లంటరా?’ అని వదిలేసేవాళ్లం. పెండెలం అనే పెద్ద చెట్టు ఉండేది. కంద దుంపల్లాంటి గడ్డలు కాండానికే కాసేవి. వాటిని కూర వండితే ఎంతో రుచిగా ఉండేది. ఇక పూల మొక్కలైతే లెక్కేలేదు. మల్లెల్లో ఎన్ని రకాలున్నాయో.. అన్నీ మా పెరట్లో ఉండేవి. గన్నేరు, నందివర్ధనం, చేమంతి, కనకాంబరం, లిల్లీ, గులాబి, మందార, జాజి సరేసరి. బంతి, గోరింట, సీతజడ ఇట్లాంటివన్నీ మూడు నెలలపాటు విరగపూసేవి. ఆకుకూరలు, చిక్కుడువంటి కూరగాయలెన్నో మా పెరట్లోనే కాసేవి. మేము సెలవుల్లో అమ్మ నీళ్లు చేది పోస్తుంటే.. చిన్న బిందెలతో చెట్లకు నీళ్లు పోసి, తడిసిన మట్టి వాసనను పీలుస్తూ ఆనందించేవాళ్లం. జీతగాళ్లకు పొలం పని తప్ప ఇంటి పనులు చెప్పడం నాన్నకు ఇష్టం ఉండేది కాదు. అది ఉత్తమ యజమాని లక్షణమే కాదు, సంస్కారం కూడా.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
“Ramaayanam | మామయ్య పెండ్లి..”
Ramaayanam | పరీక్షలొస్తున్నయ్..