కాళేశ్వరం కుప్పకూలింది, కాళేశ్వరం వల్ల ప్రయోజనమేమీ లేదు, కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అది తప్పుడు ప్రచారం అని తెలిసినా దాన్ని ప్రజల్లో నిలిపేందుకు కమిషన్లు, కమిటీలు అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. అది నిజమనేలా, లక్ష కోట్ల కుంభకోణం జరిగిందచ్చు అని ప్రజలు అనుకోవాలనే విధంగా సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. మరి అదే కాళేశ్వరం జలాలు నేడు వరదకాలువలోకి రాకపోతే రైతుల పరిస్థితి ఏమిటో వరదకాలువ ఆయకట్టు కింద పంటలను సాగుచేస్తున్న ప్రతి రైతుకు తెలుసు. అదే కాళేశ్వరం గంగ పంటలకు సాగునీరందిస్తూ రైతులను ఆదుకుంటున్నది.
మోర్తాడ్, మార్చి 8: వరద కాలువపై ఆధారపడి సాగుచేస్తున్న పంటలకు కాళేశ్వరం జలాలు ఊపిరి పోశాయి. రివర్స్ పంపింగ్ ద్వారా రెండుసార్లు కాళేశ్వరం గంగ ఆదుకున్నది. ఇటీవల వరద కాలువకు గండిపడడంతో ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని అందించాలని రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో వరద కాలువకు రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేశారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండిపడడంతో ఎస్సారెస్పీ నుంచి వరదకాలువకు నీళ్లు వచ్చే అవకాశం లేకపోవడంతో అధికారులు రివర్స్‌పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలను రెండుసార్లు తెప్పించారు. దీంతో వరద కాలువ యాసంగి పంటలకు వరప్రదాయినిగా మారింది. వరదకాలువకు గండిపడిన వేళ.. కష్టకాలంలో బాల్కొండ నియోజవర్గంతోపాటు జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పంటలకు సాగునీరు అందిస్తున్నది కాళేశ్వర గంగ.
సాగునీటి ఇబ్బందులను దూరం చేసిన ‘కాళేశ్వరం’
వరద కాలువకు గండిపడడంతో రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని అందించాలని రైతులు ఆందోళనకు సిద్ధం కావడం, అదే సమయంలో మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వరదకాలువ సీఈ, గాయత్రీ పంప్‌హౌస్ సీఈ సుమతీదేవీ, శ్రీనివాస్‌గుప్తాతో మాట్లాడారు. వరద కాలువకు రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని అందించి, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతో అధికారులు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేయడంతో జనవరి 8న నిజామాబాద్ జిల్లాలోని వరదకాలువలోకి వచ్చి చేరింది. ఇటీవల వరదకాలువ గండి పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఈ సుమతీదేవీని రైతులు తిరిగి నీటిని విడుదల చేయాలని కోరగా రెండోసారి ఇదే నెలలో విడుదల చేశారు. ఈనెల 5న తిరిగి వరదకాలువలోకి కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. జనవరిలో వచ్చిన నీటిని విడుదల చేయగా, రైతులు పంటలకు సాగునీటి అందించగలిగారు. దీంతో చేతికి వచ్చే పంటలకు ఎటువంటి ఇబ్బందులు కాలేదు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఎర్రజొన్న, మక్కజొన్న, కూరగాయలు, వరి పంటకు మరోసారి కాళేశ్వరం జలాలు విడుదల చేయడంతో సాగునీటి ఇబ్బందులు దూరమయ్యాయి.
వరద కాలువలో మట్టికట్టను నిర్మించుకున్న రైతులు
వరదకాలువలోకి కాళేశ్వరం జలాలను విడిచినా.. వాటిని ఒడిసి పట్టుకోవాలంటే గండిపడిన ప్రాంతానికి ఇవతలి వైపు అడ్డుగా కట్టను నిర్మించుకోవాల్సి వచ్చింది. దీంతో మోర్తాడ్, కమ్మర్పల్లి రైతులు స్వయంగా తమ సొంతఖర్చులతో మోర్తాడ్ శివారులోని వరదకాలువకు అడ్డుగా మట్టికట్టను నిర్మించుకున్నారు. జనవరిలో రివర్స్‌పంపింగ్ ద్వారా వచ్చిన నీరు అడ్డుకట్ట వరకు చేరుకుని వరదకాలువలో నీరునిలిచేలా చేసింది. యాసంగి పంటలకు సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఫిబ్రవరి మొదటివారంలో వరదకాలువలో నీరు పూర్తిస్థాయిలో తగ్గిపోతున్న విషయాన్ని రైతులు గుర్తించి మరోసారి విడుదల చేయాలని అధికారులను కోరడంతో తిరిగి నీటిని విడుదల చేశారు. దీంతో యాసంగి పంటలకు సాగునీటి సమస్య తీరిపోయిందని రైతులు అంటున్నారు. వరదకాలువలోకి కాళేశ్వరం జలాలు రావడం కారణంగా యాసంగి పంటలకు సాగునీటి సమస్య తీరడంతోపాటు సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో బోరుబావులపై ఆధారపడి పంటలు పండించే రైతులకు కూడా లాభం చేకూరుతున్నది. కాళేశ్వరం జలాలు రాకపోతే వేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే వారమని రైతులు చెబుతున్నారు.

కాళేశ్వరం జలాలు రాకపోతే నష్టపోయే వాళ్లం
వరదకాలువకు గండిపడడంతో కాళేశ్వరం నీళ్లు రప్పించాలని కోరాం. నీళ్లు వస్తాయని తెలిసి వరదకాలువలో కట్టను నిర్మించుకున్నం. వరదకాలువకు రివర్స్‌పంపింగ్ ద్వారా నీళ్లు తేవడంతో పంటలను కాపాడుకోగలిగినం. ఎర్రజొన్న, మక్కజొన్న పంటలు చేతికి రాగా, కోతలు నడుస్తున్నయి. మరోసారి వరదకాలువకు నీళ్లు విడుదల చేశారు.ఉన్న పంటలకు కూడా నీటి సమస్య లేదు. వరదకాలువ నీళ్లు లేకపోతే మాత్రం వేసిన పంటలన్నీ నష్టపోయేవాళ్లం.
-నారాయణ, రైతు, కమ్మర్పల్లి
బోర్లలో నీళ్లు పెరిగినయ్
వరదకాలువలకు నీళ్లు రావడంతో భూగర్భజలాలు పెరిగి భూగర్భ జలాలు పెరిగినయ్. బోర్లలోకి నీళ్లు రావడంతో పంటలకు నీరివ్వగలుగుతున్నం. రెండోసారినీళ్లు వచ్చినయి కాబట్టి యాసంగి పంటలకు ఢోకా లేదు. గండిపనులు తొందరగా పూర్తయితే వరదకాలువకు ప్రాజెక్ట్ నీళ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దీంతో చెరువులు నింపుకోవడంతోపాటు, వరదకాలువకు ఇరువైపులా భూగర్భజలాలు పెరగడంతో సాగు, తాగునీటికి ఢోకా ఉండదు.
-పార్శపు పెద్దిరెడ్డి, రైతు, కమ్మర్పల్లి