Indonesia : ఇండోనేసియాలోని మదురా ద్వీపంలో ఒక ఫెర్రీ అగ్ని్ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 41 మంది గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో ఫెర్రీలో 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఆదివారం, ఇండోనేసియా తీరంలో జరిగింది. ఈస్ట్ జావా ప్రావిన్స్ నుంచి ఒక ఫెర్రీ దక్షిణ సులావేసిలోని మకస్సార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఫెర్రీలో, కొన్ని గంటల తర్వాత ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి.
దీంతో ఫెర్రీ సిబ్బంది ఇండోనేసియా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు ఫెర్రీ వద్దకు చేరుకుని, ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నించాయి. మొత్తం 225 మందిని రెస్క్యూ టీంలు కాపాడాయి. ఐదుగురు మరణించగా, 41 మంది గల్లంతయ్యారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండోనేసియా అధికారులు వెల్లడించారు. అయితే, ఫెర్రీలో అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అందులోని ప్రయాణికులు ఫెర్రీ ముందు భాగానికి వచ్చి సహాయం కోసం అర్థించారు.
అక్కడే ఉన్న నౌకల వారిని సహాయం అడిగారు. గత ఏడాది కూడా ఇండోనేసియాలో ఒక ఫెర్రీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 150 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఇటీవలి కాలంలో ఇండోనేసియాలో ఫెర్రీలు అనేకసార్లు అగ్నిప్రమాదాలకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.