అభివృద్ధి పనులకూ మూడు రంగులు పూయడం ఏ మేరకు సబబో రాష్ట్ర ప్రజలే రానున్న ఎన్నికల్లో నిర్ణయిస్తారు? ప్రతి పనికీ కాలమే సమాధానం చెప్తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లా సమీకృత కార్యాలయాలకు శంకుస్థాపనలు చేసి తొంభై శాతం పనులు పూర్తిచేసింది. దాదాపు మూడేండ్లు కాలయాపన చేసిన కాంగ్రెస్ సర్కార్ నేడు రిబ్బన్లు కట్‌చేస్తూ ఆర్భాటాలకు పోతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘మందిగన్న పిల్లలకు తమ పేరు పెట్టుకుంటున్నది’ అనే చందంగా పాలకుల ధోరణి ఉన్నది. తాజాగా కరీంనగర్ నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ వేడుక ఇదే తంతును తలపించింది.
‘నారు పోసినోడిదే పంట..నీళ్లు పోసినోడిదే పంట..కోత కోసినోడిదే పంట’ అని ఒక్కొక్కరు చెప్పుకుంటే రైతు ఏం చేయాలి? పంటకు యజమాని ఒక్కడే. అలాగే ప్రజాధనంతో నిర్మించే ప్రభుత్వ భవనానికి కూడా యజమాని ప్రజలే. ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు..కానీ, ప్రజల సొమ్ముతో పేర్చిన ఏ ఒక్క ఇటుక కూడా ఏ నాయకుడి వ్యక్తిగత ఆస్తి కాదనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకుంటే మంచిది. కరీంనగర్ కలెక్టరేట్ కథ కూడా ఇలాంటిదే.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లాల పరిపాలనకు అవసరమైన మౌలిక వసతుల్లో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగానే కరీంనగర్ భవనానికి 2021లో శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ‘ఇంట గెలిచి రచ్చ గెలువాలి’ అనే సామెత గుర్తుకొస్తున్నది. ప్రారంభోత్సవ వేదికపై ఎవరెంత గొప్పలకు పోయినా..అసలు గెలుపు ప్రజల విశ్వాసం పొందడంలోనే ఉంటుందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. ఒక భవనానికి రిబ్బన్ కత్తిరించి సంబురపడటం కంటే, ఆ భవనంలోకి సమస్యతో వచ్చిన సామాన్యుడికి పరిష్కారం చూపడం గొప్ప ఆనందాన్నిచ్చే పని. అలాంటి పనులేవీ నేడు పాలక ప్రభుత్వం చేయడంలేదు.
‘మొక్క నాటిందొకరు..చెట్టు పెంచిందొకరు..నీడలో కూర్చున్నది ఇంకొకరు’ అన్నట్టుగా అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ పార్టీల మధ్య కీర్తి కోసం పోటీ కొత్త విషయం కాదు. పది శాతం పనులను పూర్తిచేయడానికి కావాలనే దాదానె మూడేండ్ల సమయం తీసుకుని తమ ఘనతగా చెప్పుకోవడమే విడ్డూరం.
‘పిల్లి కండ్లు మూసుకుని పాలు తాగితే లోకం చీకటైపోతుందా’? గత పాలకుల హయాంలో జరిగిన అభివృద్ధి పనుల చరిత్రను ప్రజలు మరిచిపోతారనుకోవడం కాంగ్రెస్ నాయకుల భ్రమ. ఎవరి హయాంలో ఏ పని మొదలైంది? ఎన్ని నిధులు మంజూరయ్యాయి? ఎప్పుడు పనులు మొదలయ్యాయి? ఎంతకాలం నిర్మాణం సాగింది? ఏ ప్రభుత్వం ఎంతవరకు తీసుకెళ్లింది? చివరకు ఎవరి హయాంలో పూర్తయింది? ఇవన్నీ ప్రజల రికార్డుల్లో పదిలంగా ఉన్నాయి. అందుకే అభివృద్ధి పనులపై ‘ఎవరి బిడ్డ?’ అనే రాజకీయ తగాదా కంటే ‘ఎవరి కృషి ఎంత?’ అనే లెక్క ప్రజలకు.
ప్రభుత్వాలు మారినప్పుడు గత సర్కార్ చేసిన పనులను పాలకులు కొనసాగించడం తప్పు కాదు. అది పరిపాలనా పరిపక్వత. కానీ, ‘కొత్త కుండకు పాత మూత’ అన్నట్టుగానే ఉన్నది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల విషయంలోనూ చర్చ అవసరం. నూతన కలెక్టరేట్ సముదాయాల ప్రారంభోత్సవ వేడుకల సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పనిచేయాల్సి ఉండేది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 108 పథకాన్ని కీర్తిస్తూనే ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇది కదా నాయకుడి గొప్పతనం.
ప్రస్తుత ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ‘అరచేతిలో వైకుంఠం చూపించినంత మాత్రాన వైకుంఠం దక్కదు’. కలెక్టరేట్ ప్రారంభమైందంటే పరిపాలన మెరుగుపడినట్టే కాదు. కలెక్టరేట్ అంటే భవనమే కాదు, అది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వారధి. ఒక రైతు సమస్యతో వచ్చినా.. పింఛన్ కోసం వచ్చినా..భూమి వివాదంతో వచ్చినా.. సంక్షేమ పథకం కోసం వచ్చినా..సామాన్యుడికి అక్కడ న్యాయం జరుగాలి. ‘గోడలకే కాదు.. గోడ దాటిన గొడవకు కూడా విలువ ఉండాలి’.
ఫైళ్లు కదలాలి, సమస్యలు పరిష్కారం కావాలి. అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గాలి. అప్పుడే సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మించిన కేసీఆర్ అసలు ఉద్దేశం నెరవేరుతుంది. కరీంనగర్ కలెక్టరేట్ విషయంలోనైనా, రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి పనుల విషయంలోనైనా ప్రభుత్వం ఒక ‘వర్క్ హిస్టరీ’ ప్రజల ముందుంచాలి. శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రతి దశను వెల్లడించాలి. అప్పుడే ఎవరి పనితీరు ఏందో ప్రజలకు తెలుస్తుంది. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి ఆగకూడదు.
కరీంనగర్‌లోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ పరిస్థితి నాడెట్లుండెనో..ఇప్పుడెట్లున్నదో ప్రజలకు తెలుసు. కానీ, అధికారమదంతో ఊరేగుతున్న కాంగ్రెస్ పేరు మార్చినంత మాత్రాన అది ఎవరి హయాంలో నిర్మితమైందో ప్రజలకు తెలువదా? అధికారం వస్తే గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల చరిత్రను చెరిపేయాలని చూడకూడదు.
అలా చేస్తే..అదే చరిత్రలో కనుమరుగు కావడం ఖాయం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితీ అదే. కీర్తి కోసం కట్టిన భవనం కాదు..ప్రజల కోసం పనిచేసే పరిపాలనా వ్యవస్థే నిజమైన అభివృద్ధి నారు పోసినవాడిని మరిచి..నీళ్లు పోసినవాడిని మరిచి.. పంట కోసినవాడిని మరిచి..నేరుగా వచ్చి ఆ వడ్డించిన విస్తరి నాదే అంటే చరిత్ర ఒప్పుకోదు. అభివృద్ధి పనులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. రిబ్బన్ ఎవరు కట్ చేశారన్నది క్షణికం, ప్రజల కోసం ఎవరు ఎంత చేశారన్నదే చరిత్రలో శాశ్వతం.
(వ్యాసకర్త: రాష్ట్ర మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే)
-గంగుల కమలాకర్