‘సాఫ్ట్వేర్ జాబ్ చేసి, నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. ఇష్టంతో ఓ రంగాన్ని ఎంచుకున్నప్పుడు కష్టమైనా భరిచాలి. సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అన్నారు కన్నడ కస్తూరి శ్రీనిధి శెట్టి. ఈ అందాలభామ వెంకటేశ్‌కి జోడీగా నటించిన ‘ఆదర్శకుంటుంబం’ సినిమా ఈ నెల 9న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను శ్రీనిధి వెల్లడించారు. “ఆదర్శకుటుంబం’లో నేను పోషించిన తల్లి పాత్ర నా కెరీర్‌పై చెడు ప్రభావం చూపిస్తుందని చాలామంది అనుకుంటున్నారు.
నేనైతే అలా అనుకోను. ‘ఆదర్శకుటుంబం’ చూశాక ఆ పాత్ర నేనెందుకు ఒప్పుకున్నానో అందరికీ అర్థమవుతుంది. 15ఏండ్ల తర్వాత నేను నటించిన సినిమాలు చూసి, నేనే గర్వపడాలి’ అని చెప్పారు శ్రీనిధి. ఇంకా చెబుతూ ‘ఈ సినిమా పుణ్యమా అని వెంకటేశ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన్నే ప్రేరణగా తీసుకొని ఈ సినిమాలోని నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. వెంకటేష్ లొకేషన్లో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం’ అని ఆనందం వెలిబుచ్చారు శ్రీనిధిశెట్టి.