సినీరంగంలోకి రాకముందు రచయితగా రాణించాలనే కోరిక బలంగా ఉండేదని, అనుకోని పరిస్థితుల వల్ల నటిగా మారాల్సి వచ్చిందని అగ్ర కథానాయిక శృతిహాసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కోచిలో జరుగతున్న ఇండియా టుడే సౌత్ 2026 సదస్సులో మాట్లాడిన ఆమె కెరీర్ తాలూకు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అద్భుతమైన సినీ వారసత్వం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ నటన తన తొలి ఛాయిస్ కాదని శృతిహాసన్ పేర్కొన్నది. “హే రామ్’ సినిమాలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కుమార్తె పాత్ర కోసం ఓ ఆర్టిస్టు కావాల్సి వచ్చింది.
ఆ సమయంలో నేను సినిమా కాస్ట్యూమ్ విభాగంలో పనిచేస్తున్నా. నాన్న అభ్యర్థన మేరకు ఆ పాత్రకు ఒప్పుకున్నా. అలా నా సినీ ప్రయాణం మొదలైంది. 2009లో ‘లక్’ సినిమాలో నటించి ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామనుకున్నా. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో మ్యూజికల్ డ్రమ్‌కిట్, మిక్సర్ కన్సోల్ కొనుగోలు చేశా. ఇక సంగీతంపైనే పూర్తిగా దృష్టి పెడదామనుకున్నా. కానీ విధి మరోలా తలచింది. ‘లక్’ సినిమాలో నటన నాకే నచ్చలేదు. దాంతో నేనెంటో నిరూపించుకోవాలనే లక్ష్యంతో యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నా’ అని శృతిహాసన్ చెప్పింది.