హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: ఎన్ఐటీలోని ‘ఇండస్ట్రీ కాన్ క్లేవ్: కెరీర్ లాంచ్ సమ్మిట్-2026’ నిర్వహించారు. సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. నిట్‌లో ఈ తరహాలో నిర్వహించిన మొట్టమొదటి ఇండస్ట్రీ కాన్క్లేవ్గా నిలిచిన కార్యక్రమం ఇదే.
త్వరలో నిట్ క్యాంపస్‌లో జరుగబోయే ప్లేస్మెంట్ సీజన్‌కు ముందు విద్యార్థులకు పరిశ్రమల అంచనాలు, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ‘ఇండస్ట్రీ కాన్ క్లేవ్: కెరీర్ లాంచ్ సమ్మిట్-2026’ను రూపొందించారు. ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి.. ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందించారు. సీసీపీడీ బృందం రూపొందించిన సదస్సు ద్వారా విద్యార్థులు చురుకుగా పాల్గొని పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకుని ప్రయోజనం పొందాలని ఆయన ఆకాంక్షించారు. సీసీపీడీ హెడ్ ప్రొఫెసర్ పి.వి.సురేష్ ఈ కాన్క్లేవ్ నిర్వహణ లక్ష్యాలను వివరించారు.
ఈ సందర్భంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్మెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రెండురోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్‌లో హెచ్‌పీసీఎల్, ఎక్సాన్ మొబిల్, మైక్రోన్, ట్రూవెటా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని లీడర్ షిప్ టాక్స్, ప్యానెల్ చర్చలు, అలుమ్ని ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహించారు. కోర్ ఇంజినీరింగ్, కన్సల్టింగ్, సెమీకండక్టర్, ఎనర్జీ, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై వారు విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.