గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jul 24, 2020 , 02:44:38

నేతన్న నవ్విండు..

నేతన్న నవ్విండు..

నాడు ఉరిసిల్ల.. చేదు గతం. నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. నేడు ‘సిరి’సిల్ల.. ఇప్పుడు ఒక వస్త్ర వసంతం. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషితో పూర్వవైభవం సంతరించుక్నున్న కార్మికక్షేత్రం. ఒక ఉపాధి గని. ఎంత చేసినా తరగని పని. నాడు తుప్పు పట్టిన సాంచాలు నేడు లయబద్ధంగా మోగుతున్నాయి.. ఎక్కడికక్కడ తెగిన నూలుపోగులు, ఇప్పుడు జరిపోగులై తలతలా మెరుస్తున్నాయి. నాడు ఆత్మహత్యల బాట పట్టిన నేతన్న, నేడు చేతినిండా పని, ఆ పనికి తగ్గ వేతనంతో నవ్వులు చిందిస్తున్నాడు. రాయితీలు, వివిధ రకాల ఆర్డర్లతో సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తుండగా, బతుకు మీద ధీమాగా ఉన్నాడు.  

నేను నా చిన్నపటి సంది మగ్గాల సప్పుడు ఇనుకుంట పెరిగిన. 30 ఏళ్ల సంది సాంచాల పనిజేత్తన్న. నాడు చేతినిండా పనిలేక ఎన్నో ఇబ్బందులు వడ్డం. పూటగడవని పరిస్థితులను ఎదుర్కొన్నం. సాంచాలు సక్కగ నడవక ఎంతో మంది ఆగమైన్రు. కుటుంబాలను సాదలేక ఆత్మహత్యలు చేసుకున్నరు. ఆడు సచ్చిపోండు.. ఈడు సచ్చిపోయిండు అన్నప్పుడల్లా గుండెల్ల బండెత్తెసినట్లయితుండె. ఆళ్ల బాధలను ఇంటే కండ్లపొంటి నీళ్లు కారుతుండె. ఏ ఒక్కలూ పట్టించుకోలె. కనీ, టీఆర్‌ఎస్‌ సర్కారు అచ్చినంక మా బతుకులు మారినయ్‌. కేటీఆర్‌ సారు మాకింత అన్నం పెట్టిండు. బతుకమ్మ చీరెలు, స్కూలు యూనిఫాంలు, రంజాన్‌, క్రిస్మస్‌ బట్టల ఆర్డర్లను సిరిసిల్లకే ఇచ్చిండు. మాకు చేతి నిండా పని చూపిండు. ఇప్పుడు నాకు నెలకు  రూ. 15వేల దాకా దొరుకుతున్నయ్‌. కుటుంబాన్ని మంచిగా పోషించుకుంటున్నం. ఇంకా 50 శాతం విద్యుత్‌ సబ్సిడీ, నేతన్నలకు 50 ఏళ్లకే ఆసరా పింఛన్‌, నూలు రాయితీ ఇచ్చిండు. మా బతుకుల్లో వెలుగులు నింపిండు. కేటీఆర్‌ సారు సల్లంగుండాలె. మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలె.  - బండారి నరేందర్‌, నేత కార్మికుడు (విద్యానగర్‌)