Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో నష్టాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కోలుకొని లాభాలను నమోదు చేశాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే 73,572.34 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 73,556.15 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. చివరి సెషన్లో 74,571.25 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 486.50 పాయింట్ల లాభంతో 74,339.44 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 167.95 పాయింట్లు పెరిగి.. 22,570.35 వద్ద స్థిరపడింది.
దాదాపు 1980 షేర్లు లాభాల్లో ట్రేడవగా.. 1,664 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా అత్యధికంగా లాభపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ కంపెనీ నష్టపోయాయి. రియాల్టీ మినహా పీఎస్‌యూ బ్యాంక్ అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ ఇండెక్స్ నాలుగు శాతం పెరిగింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. అయితే, కొటక్ మహీంద్రా బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి.