సోమవారం 18 జనవరి 2021
Nizamabad - Dec 02, 2020 , 00:29:36

క్షుణ్ణంగా పరిశీలన...!

క్షుణ్ణంగా పరిశీలన...!

  • ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల విభజన పూర్తి
  • క్షేత్ర స్థాయిలో సర్వే నంబర్ల ఆధారంగా పరిశీలన
  • ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు నో ఛాన్స్‌
  • అక్రమాలకు పాల్పడితే అధికారులు కటకటాలకే
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80వేల దరఖాస్తులు 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వుల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ ఆర్జీల విభజన దాదాపుగా పూర్తి కావొచ్చింది. నిజామాబాద్‌లో 60వేల దరఖాస్తులు, కామారెడ్డిలో 20,459 దరఖాస్తులను రెవెన్యూ సర్వే నంబర్ల ప్రకారం వేరు చేస్తున్నారు. దరఖాస్తులు వేగంగా పరిష్కారం అయ్యేందుకు కొత్తగా క్లస్టర్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నారు. దీని వల్ల ఒక ప్రాంతంలో ఉన్న దరఖాస్తులన్నీ ఒక సారి పరిశీలించే వీలు ఉంటుంది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఒక వ్యక్తి ఒక రోజు సుమారుగా 10 దరఖాస్తులు పరిశీలించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌లో అందుబాటులో ఉన్న సిబ్బందితో పాటుగా ప్రైవేటు వ్యక్తులను ఇందుకోసం వినియోగించుకునేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం వెళ్లాయి. ప్రైవేటు వ్యక్తులను ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్న అనంతరం కొద్ది రోజుల్లోనే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు ఒక్కోటి వెంటవెంటనే పరిష్కారం కానుంది.

విలీన గ్రామాల నుంచి అత్యధికంగా...

కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘాలు, పాత పురపాలక సంఘాలైన ఆర్మూర్‌, బోధన్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ నగరపాలక సంస్థల్లో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. వాటి పరిధిలో పెద్ద ఎత్తున వెంచర్లున్నాయి. చాలా మంది ఇండ్ల నిర్మాణానికి స్థలాలను కొనుగోలు చేశారు. వాటిని పంచాయతీ చట్టం కింద నమోదు చేయాలా? లేక పురపాలక చట్టం కింద నమోదు చేయాలా అన్న మీమాంస ఉండేది. ప్రభుత్వం పురపాలక శాఖ ఎన్నికల వేళ సందిగ్ధానికి తెరదించింది. పట్టణాల్లో నాలాతో పాటు పురపాలక అనుమతి తీసుకోవాలి. ఎల్‌పీ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. విలీన గ్రామాల్లో విక్రయించిన ప్లాట్లకు ఇవేవీ లేవు. మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేస్తున్నారని ముందే పసిగట్టిన వ్యాపారులు పెద్ద ఎత్తున ప్లాట్లను అమాయకులకు అప్పగించారు. వీటికి అనుమతులేవు. వీటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ అవకాశం కల్పించడంతో విలీన గ్రామాల్లో నివాస స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఊరట కలిగింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించడంతో దండిగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌తో చట్టబద్ధత...

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)లో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టవంతమైన చర్యలు తీసుకుంది. అక్రమాలకు తావివ్వకుండా ఉండేందుకు సాంకేతికతను వినియోగించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీల విషయంలో సామాన్యులు భారంగా ఫీలయ్యారు. క్రమబద్ధీకరణకు రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందనే ఆందోళనకు గురయ్యారు. ప్రజల స్పందనను గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉభయ జిల్లాల్లోని నిజామాబాద్‌ నగరపాలక సంస్థతో పాటుగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఆదరణ ఒక్కసారిగా పెరిగింది. పట్టణాలతో పాటు గ్రామాల నుంచీ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెరిగాయి. దరఖాస్తుల రూపంలో పురపాలికలు, పంచాయతీలకు ఆదాయం కూడా భారీగా చేకూరుతోంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 157 అక్రమ లేఅవుట్లు, ఆర్మూర్‌ మున్సిపాలిటీలో 213 అక్రమ వెంచర్లు, బోధన్‌ మున్సిపాలిటీలో 41 లేఅవుట్లు, భీంగల్‌ మున్సిపాలిటీలో 8 అక్రమ లేఅవుట్‌ వెంచర్లు, కామారెడ్డి మున్సిపాలిటీలో 82 అక్రమ లేఅవుట్లు , బాన్సువాడలో 14 లేఅవుట్లు, ఎల్లారెడ్డి పురలో 6 అక్రమ వెంచర్లను గుర్తించారు.

నిజామాబాద్‌ జిల్లాలో 

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 37,550

బోధన్‌ మున్సిపాలిటీ 13,877

ఆర్మూర్‌ మున్సిపాలిటీ 5,311

భీమ్‌గల్‌ మున్సిపాలిటీ 1,462

కామారెడ్డి జిల్లాలో  

కామారెడ్డి మున్సిపాలిటీ  17,650

బాన్సువాడ మున్సిపాలిటీ 1,899

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ  910