వాషింగ్టన్ : కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు అవసరమైన సహకారం అందించాలని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పెంటగాన్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌లో కరోనా రెండో దశ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌పై పోరాడుతున్న వారికి వైద్య పరికరాలను అందించాలని, తమ వద్ద ఉన్న అన్ని వనరులను వినియోగించాలని సూచించినట్లు ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, టెస్ట్ కిట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలతో సహా అవసరమైన సామగ్రిని అందిస్తామన్నారు. మహమ్మారిని ఎదుర్కొవడానికి భారత్‌కు అండగా నిలవడానికి అమెరికాలోని ఇతర విభాగాలు, పరిశ్రమలతో సమన్వయం చేసుకొని పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.
భారత్‌లో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అమెరికన్ వనరులను సమీకరించాలని ఆదేశించిన తర్వాత లాయిడ్ ఆస్టిన్ నుంచి ప్రకటన వచ్చింది. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ 50 మిలియన్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఆ దేశానికి పంపిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి సాయంలో భాగంగా.. 300కుపైగా ఆక్సిజన్ మిషన్లు న్యూయార్క్ నుంచి ఆదివారం ఉదయం భారత్‌కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. ఐదు టన్నుల ఈ ఆక్సిజన్‌ను ఎయిర్ ఇండియా రవాణా చేస్తోంది. సోమవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీకి చేరుకోనున్నాయి.
I’m deeply concerned about the COVID-19 outbreak in India, and today, I directed the @DeptofDefense to use every resources at our disposal, within our authority, to support U.S. interagency efforts to provide India’s frontline healthcare workers with the materials they need. pic.twitter.com/v93iek3G2i
— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) April 25, 2021