తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. 1175 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,25,237కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,726గా ఉంది.
ఏపీ సీఎం జగన్‌పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తోందని, ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అని కోపోద్రిక్తులయ్యారు. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతే ఊరుకునేది లేదన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరు అని స్పష్టం చేశారు.
తన చివరి శ్వాస వరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో కష్టపడి పని చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు కథనాలను ప్రచురించిన దిశ వెబ్సైట్, ఆర్బీసీ యూట్యూబ్ ఛానెల్‌పై హైదరాబాద్ సీపీకి దానం నాగేందర్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణను గుంజుకోవడానికి ఆయన అబ్బ సొమ్ము కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు తల, తోక ఉండవు అని ధ్వజమెత్తారు. తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శిస్తే సహించమని దానం తేల్చిచెప్పారు.
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 317.610 మీటర్ల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, 7.855 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 11.95 టీఎంసీల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి 6,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది.
కృష్ణానదీ జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను తెలంగాణ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. జూరాల నుంచి పులిచింతల వరకు డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాల పహారా ఏర్పాటుచేశారు. అలాగే జూరాల ఆనకట్టపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. శ్రీశైలం జలాశయం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసు భద్రతను పెంచాయి. ఇక నాగార్జునసాగర్ జలాశయం వద్ద మూడో రోజు పోలీసు బందోబస్తు కొనసాగుతున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, ఏపీ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక జూలైలో సాధారణ వర్షం కానీ, అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువులో పడి శుక్రవారం ఉదయం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. మృతుణ్ని పుల్కల్ మండలం బద్రిగూడెం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న నర్సింలు (45)గా గుర్తించారు. నర్సింలు ప్రమాదవశాత్తూ మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
గుడిసెలో నివాసం ఉండే 65 ఏండ్ల వృద్ధురాలికి ఏకంగా రూ.2.5 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గునాలో ఈ ఘటన జరిగింది. తన ఇంట్లో ఒక బల్బు, ఒక టేబుల్ మాత్రమే ఉన్నాయి. అయితే లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా బిల్లు చెల్లించలేదని.. దీంతో ఈ నెల ఏకంగా రూ.2.5లక్షల బిల్లు వచ్చిందని రాంబాయి ప్రజాపతి వాపోయింది. దీనిపై విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా రాజ్‌పొరా ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీర మరణం పొందగా, ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం చెలరేగింది. శుక్రవారం ఉదయం 4.25 గంటల ప్రాంతంలో పాక్ వైపు నుంచి వచ్చిన చిన్నపాటి డ్రోన్ సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సైనికులు దానిపై కాల్పులు జరిపారు. వెంటనే అది అటు నుంచి వెనక్కి మళ్లిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. జమ్మూలోని భారత వైమానిక కేంద్రంపై గత ఆదివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న 6 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రజారోగ్య బృందాలను పంపింది. ఆరు రాష్ట్రాల్లో కరోనా నిర్వహణ, టెస్టింగ్, నిఘా, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి వాటిని ఈ కేంద్ర బృందాలు పర్యవేక్షిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ వెల్లడించింది. కరోనా నియంత్రణ కోసం తమ సహాయ సహకారాలు అందిస్తాయని తెలిపింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు భారీ శబ్దం వినిపించింది. భారీ శబ్దంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ శబ్దానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ శబ్దంపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. తమ విమానాలు ఇలాంటి శబ్దాలు చేయలేదని స్పష్టం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో గురువారం 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అదే నగర శివారుల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరింది. గత 90 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో జూలై నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. జూలై 1, 1931లో నగరంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
దేశంలో రెండు రోజుల విరామం అనంతరం పెట్రోల్ రేట్లు శుక్రవారం మరోసారి పైకి కదిలాయి. ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు చేరగా.. తాజాగా 35 పైసలు పెరిగింది. పెంచిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ.100కు చేరువైంది. డీజిల్ రూ.89.15కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు చేరింది. తెలుగు రాష్ట్రాలు సహా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటింది.
అమెరికా కుబేరుల మధ్య స్పేస్ వార్ తీవ్రమవుతోంది. అంతరిక్షంలోకి వెళ్లడానికి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్లాన్ చేయగా.. ఆయన కంటే ముందే అక్కడికి వెళ్లడానికి వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ సిద్ధమయ్యారు. బ్రాన్సన్తో కలిసి ఓ తెలుగమ్మాయి బండ్ల శిరీష కూడా స్పేస్‌లోకి వెళ్లబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఆమె.. కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. కల్పనా చావ్లా తర్వాత ఇండియాలో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళ ఈమెనే.