Nora Fatehi | కన్నడ నటుడు ధ్రువ సర్జా కథానాయకుడిగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘KD: ది డెవిల్’ భారీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని “సర్కే చునర్ తేరి సర్కే” అనే స్పెషల్ సాంగ్ అశ్లీలంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాటపై నిషేధం విధించాలని కోరుతూ ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ పాటలోని సాహిత్యం మరియు దృశ్యాలు అత్యంత అశ్లీలంగా, అసభ్యకరంగా ఉన్నాయని, ముఖ్యంగా మైనర్లకు హాని కలిగించే విధంగా ఉన్నాయని జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విచ్చలవిడిగా ప్రచారంలో ఉన్న ఈ పాట, పబ్లిక్ డెన్సీని దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు.
ఈ పాటలో ఉపయోగించిన పదజాలం మరియు నృత్య రీతులు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇది సమాజంలో అసభ్యతను ప్రోత్సహిస్తుందని జిందాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాటకు సాహిత్యం రాసిన రాకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, సంగీత దర్శకుడు అర్జున్ జన్య మరియు గాయని మంగ్లీ వంటి వారిని కూడా ఈ ఫిర్యాదులో ప్రస్తావించాడు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 294, పోక్సో (POCSO) చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ పాటను పంపిణీ చేయడం నేరమని జిందాల్ వాదించారు. ఇప్పటికే ఈ అంశంపై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్లో కూడా విడిగా క్రిమినల్ ఫిర్యాదు నమోదైందని, పిల్లల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ పాటను వెంటనే తొలగించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.