Harish Rao | సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఈ జిల్లాకు ఎలా అడుగుపెడతావని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేటపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రద్దు చేశావని నిలదీశారు. ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. కక్షపూరితంగా నువ్వు రద్దు చేసిన నిధుల గురించి.. ఆగిపోయిన పనుల గురించి మా సిద్దిపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతావని ప్రశ్నించారు.
సిద్దిపేట అభివృద్ధిపై ఆనాడు నువ్వు చేసిన విమర్శలను, నీ ఓర్వలేని తనాన్ని మా ప్రజలు మర్చిపోలేదని హరీశ్‌రావు అన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. నువ్వు ప్రారంభించేందుకు వస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిధులు కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైనవే అని స్పష్టం చేశారు.
సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని, నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.1070.73 (ఒక వెయ్యి డెబ్బై కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు) కేటాయింపు జరిగిందని.. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా ఈ నిధులను మీరు రద్దు చేశారని తెలిపారు. దీంతో పనులన్నీ ఆగిపోయాయని అన్నారు. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్తు మరోలా ఉండేదని అన్నారు. సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్దరించాలలని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.
– ప్రభుత్వ వెటర్నరీ కళాశాల
– రంగనాయకసాగర్ టూరిజం
– కోమటిచెరువు శిల్పారామం
– సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగు రోడ్డు
– తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల
– మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం
– సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్
– టు టౌన్ పోలీస్‌స్టేషన్ భవనం
– త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ భవనం
– సిద్దిపేట– ఇల్లంతకుంట ఫోర్‌లేన్ రోడ్డు
– సిద్దిపేట– కిష్టాపూర్ రహదారి
– సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం
– సిద్దిపేట బ్లాక్‌ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్

Harish Rao Letter Page1

Harish Rao Letter Page2