ముంబై: ఒక వంశంలో 200 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదు తరాల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి ఇంటి వరకు తల్లీ, బిడ్డను ప్రత్యేక రథంలో ఊరేగించారు. డప్పులు, మేళ తాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. (After 200 Years A Girl Born In Family) మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లాతూర్ జిల్లా అహ్మద్పూర్ తాలూకాలోని కోల్వాడి గ్రామానికి చెందిన లింబాజీ దహిఫలే వంశంలో గత ఐదు తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. అంతా మగ సంతానమే. ఈ నేపథ్యంలో గత 200 ఏళ్లుగా ఆడబిడ్డ కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తున్నది.
కాగా, లింబాజీ దహిఫలే కుమారుడు రిషికేశ్ దహిఫలే, కోడలు సౌభాగ్యవతి కల్పనకు ఆ అదృష్టం దక్కింది. సౌభాగ్యవతి కల్పన ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో లింబాజీ కుటుంబంలో ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత నవజాత శిశువు గార్గికి ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఊరేగింపు ఏర్పాటు చేశారు. పూలతో అలంకరించిన రథంలో తల్లి, బిడ్డను తీసుకువచ్చారు. డప్పులు, మేళ తాళాల వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. 200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డను రాజకుమారి మాదిరిగా భావించి ఈ వేడుక నిర్వహించడం చూసి స్థానికులు కూడా చాలా ఆనందించారు.
మరోవైపు ఆ శిశువు తాత, నానమ్మలు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా కుటుంబంలో ఆడపిల్ల పుట్టడం గొప్ప అదృష్టం. ఇన్నాళ్లూ మాకు ఆడపిల్ల లేదన్న వెలితి ఉండేది, ఈ రోజు ఆ కోరిక నెరవేరింది’ అని తాత లింబాజీ దహిఫలే అన్నారు. ‘ఈ రోజు మా ఇంటికి లక్ష్మి వచ్చిందని మేం చాలా సంతోషిస్తున్నాం’ అని గార్గి నానమ్మ సురేఖ ఆనందం వ్యక్తం చేసింది.
కాగా, తమ కుటుంబంలో ఆడబిడ్డ పుట్టడం ప్రత్యేకమైన సంతోషాన్ని తెచ్చిందని గార్గి తండ్రి రిషికేశ్ దహిఫలే హర్షం వ్యక్తం చేశారు. ‘ఆడపిల్లలు తమ తండ్రులతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు. మేము మా కూతురిని ఒక పువ్వులా పెంచుకుంటాం’ అని ఆయన అన్నారు. 200 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్లకు ఆ కుటుంబం ఘనంగా స్వాగతం పలికిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A baby girl born in Maharashtra’s Beed after nearly 200 years was given a grand welcome as the Dahifale family celebrated the arrival of their first daughter in generations. The newborn was brought home with her mother in a chariot procession accompanied by drums, cymbals and… pic.twitter.com/GnO6UyzkNU
— IndiaToday (@IndiaToday) September 2, 2026