Viral News : విదేశాలకు వెళ్లేటప్పుడు చాలామంది ఇక్కడున్న తమ వాహనాల భద్రత (Security) గురించి ఆందోళన చెందుతుంటారు. ఇంట్లోనే పార్కు చేస్తే ఇరుగుపొరుగు వారిని చూడమని చెప్పడం, లేదంటే దగ్గరి బంధువులు, స్నేహితుల ఇళ్లలో పార్కు చేసి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. కానీ బీహార్ (Bihar) కు చెందిన ఓ మహీంద్రా స్కార్పియో (Mahindra Scarpio) యజమాని మాత్రం తన ఆందోళనను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. తన కారు దొంగల బారిన పడకూడదనే ఉద్దేశంతో ఏకంగా ఓ క్రేన్ సహాయంతో తన ఎస్‌యూవీని ఇంటి పైకప్పు మీదకు చేర్చారు.
ప్రస్తుతం ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ప్రకారం.. ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కారును క్రేన్ సహాయంతో జాగ్రత్తగా ఓ నివాస భవనం పైకప్పు మీదకు ఎక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ కారు యజమాని ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని, తాను తిరిగి వచ్చేవరకు కారును నేల మీద వదిలి వెళ్లడం సురక్షితం కాదని భావించినట్లు తెలుస్తోంది.
పెయిడ్ పార్కింగ్ లేదా బంధువుల ఇంట్లో ఉంచడం వంటి సాధారణ మార్గాలను కాకుండా.. ఇలా వినూత్నంగా తన కారును ఇంటి పైకప్పు మీద పార్క్ చేశారు. ఈ ఘటన బీహార్‌లోని ఏ ప్రాంతంలో జరిగింది, యజమాని ఎవరు, కారు ఎంతకాలం పైకప్పుపై ఉంటుంది, ఈ ప్రక్రియకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా అనే విషయాలపై స్పష్టతలేదు. ఈ సంఘటన చూడటానికి వింతగా ఉన్నప్పటికీ ఇందులో అనేక భద్రతాపరమైన ప్రమాదాలు దాగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఒక ఎస్యూవీ బరువు టన్నుల్లో ఉంటుంది. అంతటి బరువును మోసేలా ఇంటి పైకప్పును నిర్మించి ఉండకపోవచ్చు. ఒకేచోట ఎక్కువ బరువు పడటంవల్ల భవనం నిర్మాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా క్రేన్‌తో వాహనాన్ని పైకి లేపడం కూడా అత్యంత నైపుణ్యంతో కూడుకున్న పని. శిక్షణ పొందిన ఆపరేటర్లు, సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి పనులు చేయడం అత్యంత ప్రమాదకరం.
కారును మళ్లీ కిందకు దించడం కూడా ఓ పెద్ద సవాలే. ఎక్కువ కాలం ఎండ, వానకు నేరుగా ప్రభావితం కావడం వల్ల వాహనం పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ రోజులు వినియోగించకపోవడం వల్ల ఇంజిన్, ఇతర భాగాల్లో సమస్యలు తలెత్తవచ్చు. వాహనాల భద్రత గురించి ఆందోళన చెందే యజమానులకు సురక్షితమైన కవర్డ్ పార్కింగ్, నమ్మకమైన సంరక్షకులను ఏర్పాటు చేసుకోవడం, వీల్ లాక్స్, జీపీఎస్ ట్రాకర్లు, బీమా, సెక్యూరిటీ కెమెరాలు వంటి ఎన్నో సురక్షితమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
A man in Bihar used a crane to lift his Scorpio onto his house rooftop to keep it safe while going abroad for work. This is hilarious and it happens in India only, leaving netizens amused by the bizarre parking method. pic.twitter.com/kmqkPpN2l9
— VIZHPUNEET (@vizhpuneet) September 3, 2026