KTR | పెనుబల్లి, సెప్టెంబర్ 5: బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ యువకుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండంత ధైర్యం చెప్పారు. “భయపడకు తమ్మీ.. ధైర్యంగా ఉండు.. నీకు, నీ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం” అంటూ వీడియోకాల్లో ఆప్యాయంగా మాట్లాడారు. చికిత్సకు ఎంత ఖర్చయినా పార్టీ తరఫున భరిస్తామని భరోసా ఇచ్చారు. తనను ఒక్కసారి కలవాలన్న యువకుడి కోరికకు స్పందిస్తూ.. “త్వరలోనే మీ ఇంటికి వస్తా.. అప్పటివరకు ధైర్యంగా ఉండు” అంటూ హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచందర్రావుబంజర్కు చెందిన బన్నె మణికంఠ యాదవ్ బోన్ క్యాన్సర్తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం కుటుంబం ఇప్పటికే భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో మరింత చికిత్స ఎలా చేయించాలన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన వెంటనే రామచందర్రావుబంజర్లోని మణికంఠ ఇంటికి వెళ్లి యువకుడి పరిస్థితిని, కుటుంబ సభ్యుల బాధను తెలుసుకున్నారు.
అక్కడి నుంచే సండ్ర వెంకటవీరయ్య కేటీఆర్కు ఫోన్ చేసి మణికంఠ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. అనంతరం యువకుడితో కేటీఆర్ వీడియోకాల్లో మాట్లాడారు. “తమ్మీ.. ధైర్యంగా ఉండు. ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నావు? నీకు ఎంత ఖర్చయినా పార్టీ నుంచి భరిస్తాం. నీకు, నీ కుటుంబానికి వీరన్న, నేను అండగా ఉంటాం. ఏం కావాలో చెప్పు.. భయపడకు” అంటూ కేటీఆర్ ధైర్యం చెప్పారు.
వీడియోకాల్లో మాట్లాడుతున్న సమయంలో మణికంఠ.. “సర్.. మిమ్మల్ని ఒక్కసారి చూడాలి.. నేరుగా మీతో మాట్లాడాలి” అని తన కోరికను కేటీఆర్కు తెలిపారు. దీనికి స్పందించిన కేటీఆర్.. “తప్పకుండా తమ్మీ.. త్వరలోనే మీ ఇంటికి వస్తాను. అప్పటివరకు ధైర్యంగా ఉండాలి” అంటూ భరోసా ఇచ్చారు. కేటీఆర్ మాటలతో మణికంఠ భావోద్వేగానికి గురయ్యారు. చెమర్చిన కళ్లతో సంతోషం వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.