Exercise | ఉదయం నిద్రలేచిన వెంటనే ఏమీ తినకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు ఎక్కువగా వినియోగమవుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే బరువు తగ్గాలని కోరుకునేవారు ఖాళీ కడుపుతో నడక, జాగింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం ప్రతి ఒక్కరికీ, ప్రతి రకమైన వ్యాయామానికీ సరిపోదు. వ్యాయామం చేసే తీవ్రత, శరీరంలోని శక్తి నిల్వలు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ తీవ్రతతో చేసే వ్యాయామాల విషయంలో సరైన శక్తి లేకపోవడం వల్ల అలసట, తల తిరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
రాత్రి 8 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సుమారుగా 10 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత ఉదయం శరీరంలో కాలేయంలోని నిల్వ కార్బొహైడ్రేట్లు కొంతవరకు తగ్గిపోతాయి. ఇన్సులిన్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువ నుంచి మితమైన తీవ్రతతో చేసే నడక, తేలికపాటి జాగింగ్, సున్నితమైన యోగా వంటి వ్యాయామాల్లో ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కొవ్వును ఇంధనంగా ఉపయోగించే శాతం పెరుగుతుంది. అయితే వ్యాయామం చేసే సమయంలో కొవ్వు ఎక్కువగా ఖర్చవడం, దీర్ఘకాలంలో శరీరంలోని కొవ్వు తగ్గడం రెండూ ఒకటే కాదు. దీర్ఘకాలిక బరువు తగ్గుదలలో రోజంతా తీసుకునే, ఖర్చు చేసే కేలరీల సమతుల్యత కీలకంగా ఉంటుంది.
ఖాళీ కడుపుతో చేసే వ్యాయామం కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావాలను కలిగించే అవకాశాలు ఉంటాయి. కాలేయంలోని శక్తి నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో అధిక తీవ్రతతో బరువులు ఎత్తడం లేదా వేగంగా వ్యాయామం చేయడం వల్ల శరీరం శక్తి కోసం కండరాల్లోని భాగాలను ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది మరింత అలసటకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే తల తిరగడం, వికారం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది.
అందువల్ల వ్యాయామం చేసే విధానాన్ని దానికి తగిన ఆహారంతో సమన్వయం చేసుకోవడం ముఖ్యం. వేగంగా నడవడం, తేలికపాటి సైక్లింగ్, తక్కువ తీవ్రతతో చేసే కదలికలు వంటి వ్యాయామాలను ఆరోగ్యంగా ఉన్న కొందరు వ్యక్తులు ఖాళీ కడుపుతో చేయవచ్చు. అయితే బరువులు ఎత్తడం, అధిక తీవ్రతతో చేసే వ్యాయామాలు, వేగవంతమైన విరామ వ్యాయామాలు లేదా గంటకు పైగా సాగే పరుగులు వంటి వాటికి శరీరానికి తగిన శక్తి అవసరం. ఇలాంటి సందర్భాల్లో వ్యాయామానికి 30 నుంచి 45 నిమిషాల ముందు తేలికపాటి కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.