Nagarmal Bajoria : భారతదేశ ఎన్నికల చరిత్ర (India’s Election History) లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యోధుడు, ‘ధర్తి పకడ్ (Dharti Pakad)’ గా పేరుగాంచిన 96 ఏళ్ల నాగర్మల్ బాజోరియా (Nagarmal Bajoria) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పట్నాలోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందలసార్లు ఎన్నికల బరిలో నిలిచి, ఒక్కసారి కూడా గెలువకపోయినప్పటికీ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడమే ముఖ్యమని చాటిచెప్పారు. ఆయన మృతితో ఇప్పుడు ఒక శకం ముగిసినట్లయ్యింది.
1930లో లాహోర్‌లో జన్మించిన నాగర్మల్ కుటుంబం.. దేశ విభజనకు ముందే బిహార్‌లోని భాగల్పూర్కు వలస వచ్చింది. అక్కడ వ్యాపారం చేస్తూనే ఆయన సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. వార్డు స్థాయి ఎన్నికల నుంచి విధానసభ, లోక్‌సభ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల వరకు సుమారు 280కి పైగా ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఓటమి ఎదురైన ప్రతిసారి “నేను ఎన్నికల్లో ఓడిపోను, ప్రజలే ప్రతిసారి ఓడిపోతున్నారు” అని చెప్పేవారు. తన ఓటమిని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు.
దేశ రాజకీయాల్లో దిగ్గజాలుగా వెలిగిన ఇందిరా గాంధీ (రాయ్‌బరేలి), రాజీవ్ గాంధీ (అమేథి), అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, ప్రణబ్ ముఖర్జీ వంటి వారిపై కూడా ఆయన పోటీకి నిలిచారు. 1997లో వాజ్‌పేయికి వ్యతిరేకంగా 100 గాడిదలతో ప్రచారం నిర్వహించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 1969లో రాష్ట్రపతి అభ్యర్థి వీవీ గిరిపై నామినేషన్ వేయడంతోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 17-18 సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
రాజకీయాల్లోనే కాకుండా సామాజిక సేవలోనూ బాజోరియా చురుగ్గా పాల్గొన్నారు. పేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించడం, వరకట్న రహిత వివాహాలను ప్రోత్సహించడం, తాగునీటి కోసం ట్యూబ్‌వెల్స్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. పట్నా నుంచి ఆయన భౌతికకాయాన్ని భాగల్పూర్కు తరలించారు. శుక్రవారం ఆయన నివాసం నుంచి వేలాది మంది అనుచరుల మధ్య అంతిమయాత్ర నిర్వహించి, బరారీ ఘాట్‌లో అంత్యక్రియలు జరిపించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.