Invitation : భారత్ – చైనా (India – China) దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ (Tianjin) నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కి శుక్రవారం చైనా అధికారికంగా ఆహ్వానం పలికింది. 2020లో గల్వాన్ లోయ (Galwan valley) లో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు.
ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరుకానున్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ధృవీకరించారు. కాగా గల్వాన్ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు నాలుగేళ్ల పాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో ఇరుదేశాల మధ్య ఒక అంగీకారం కుదరడంతో ప్రతిష్టంభన వీడింది.
ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారుల సమావేశంలో గట్టిగా చెప్పారు.
కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు SCO చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.