Netanyahu : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో ఎలా వ్యవహరించాలనే అంశంపై తాను భారత ప్రధాని (Prime Minister of India) నరేంద్ర మోదీ (Narendra Modi) కి కొన్ని సలహాలు ఇస్తానని ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) చెప్పారు. నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ తనకు అత్యంత సన్నిహితులని, కాబట్టి తాను వారికి సాయపడగలనని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత జర్నలిస్టుల బృందంతో నెతన్యాహు మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. ట్రంప్‌తో డీల్ చేసే విషయంలో మోదీకి కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఆ విషయాలను నేను బహిరంగంగా కాకుండా పర్సనల్‌గా చెబుతా’ అని నెతన్యాహు అన్నారు. త్వరలోనే తాను భారత్‌లో పర్యటించాలని ఆశిస్తున్నట్లు నెతన్యాహు తన మనసులోని మాటను బయటికి చెప్పారు.
భారత ఉత్పత్తులపై అమెరికా అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత వస్తువులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం సుంకాలను 50 శాతానికి పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేగాక రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్పందిస్తూ.. అమెరికా-భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, సుంకాల సమస్యను ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు.
భారత్-అమెరికా మధ్య సమస్య పరిష్కారమైతే అది ఇజ్రాయెల్‌కు కూడా మేలు చేస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి సహకారం అందిస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలావుంటే గురువారం ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్‌తో నెతన్యాహు సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు సమాచారం.