హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): టాంజానియా దేశానికి డిజిటల్ ఎకానమీ సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సమగ్ర కార్యప్రణాళికను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో టాంజానియా కమ్యూనికేషన్లు, ఐటీ శాఖల మంత్రి ముద్రిక్ రమదాని సోరాగా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా ఇరువురు తెలంగాణ-టాంజానియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సామాజిక, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి బలమైన పునాదిగా మారిందన్నారు.
ఆ దిశగా తెలంగాణ వేసిన అడుగులు ప్రపంచ పటంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేశాయన్నారు. ఇదే స్ఫూర్తితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారం, మెంటార్షిప్, నైపుణ్య మార్పిడి అందిస్తామన్నారు. అకడ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా మహిళా సాధికారత, ఎమర్జింట్ టెక్నాలజీస్, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టం, కెపాసిటీ బిల్డింగ్, సిల్ డెవలెప్మెంట్ తదితర కీలక రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి చర్యలు తీసుకుంటామన్నారు.
టాంజానియా మంత్రి ముద్రిక్ రమదాని మాట్లాడుతూ.. డిజిటల్ ఎకానమీగా మారాలన్న మా లక్ష్య సాధనలో తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో అవసరమని చెప్పారు. ఐటీ, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టం, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, చేపట్టిన సంసరణలు తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.