న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మంగళవారం లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తన పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. విద్యార్థులకు సంస్కరణలు అవసరం అని, కానీ ఆగ్రహం కాదు అని అన్నారు. విద్యార్థులకు సమాధానం ఇచ్చే బాధ్యత తమకు ఉన్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం న్యాయం చేసేందుకు కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ అదే పనిగా విద్యార్థులను తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకునేందుకు విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తున్నదని ఆరోపించారు. దీని కోసమే ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నా చేపట్టారని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, సెక్యూర్టీ ప్రోటోకాల్స్‌ను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య చర్చను వదిలేసి రాజకీయ స్టంట్‌కు రెఢీ అయ్యిందన్నారు. విద్యార్థులకు పరిష్కారాలు చూపడం కాంగ్రెస్ లక్ష్యం కాదు అని, కేవలం రాజకీయ శీర్షికల కోసం సభా సమావేశాలను అడ్డుకుంటున్నట్లు మంత్రి ఆరోపించారు.
విద్యార్థులను రాహుల్ గాంధీ పట్టించుకోరు అని, చర్చల కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. కావాలనే రాహుల్ ప్రతిఘటన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నీట్ గురించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం సిద్ధంగా ఉందని, సభా వేదికగా విద్యార్థుల సమస్యలను తొలగించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులను రాజకీయంగా వాడుకోవడం కాదు, వారికి దక్కాల్సిన బాధ్యతలు వారికి ఇవ్వాలని, విద్యార్థులను ఆందోళనల్లోకి నెట్టడం కాదు, వారికి స్థిరత్వాన్ని ఇవ్వాలని, నినాదాలు చేయడం కాదు, పరిష్కారాలు చూపాలని, చెడగొట్టడం కాదు, బాధ్యతను నేర్పాలని మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
LoP Shri @RahulGandhi and @INCIndia continue to shamelessly exploit students as political tools to manufacture disruption during the Monsoon Session of Parliament.
Shri @RahulGandhi and @INCIndia chose to stage a dharna outside the Hon’ble Prime Minister’s residence , causing…
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 21, 2026