Kiran Abbavaram | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న కిరణ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న భారీ చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.సంబరాల ఏటిగట్టు కథ మొదట తన కోసమే సిద్ధం చేశారని చెప్పారు. దర్శకుడు రోహిత్ 2021లో తనను కలిసి చిన్న బడ్జెట్ కథ వినిపించారని, అయితే ఆయనలో ఉన్న టాలెంట్ చూసి మరింత పెద్ద కాన్సెప్ట్‌తో రావాలని సూచించినట్లు తెలిపారు. ఆ తర్వాత రోహిత్ ‘సంబరాల ఏటిగట్టు’ కథతో వచ్చాడు. కథ నాకు చాలా నచ్చింది. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్‌తో కలిసి ఈ సినిమా చేయాలని అనుకున్నాం. నిజానికి ఈ దర్శకుడిని నిర్మాతకు పరిచయం చేసింది కూడా నేనే అని కిరణ్ వెల్లడించారు.
అయితే సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగానే తనకు వరుస పరాజయాలు ఎదురవడంతో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. మొదట చిన్న బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్, కథ డిమాండ్ కారణంగా క్రమంగా రూ.60–70 కోట్ల వరకు వెళ్లిందని, ఆ సమయంలో తన మార్కెట్‌కు అంత భారీ బడ్జెట్ రిస్క్ అవుతుందని భావించి తానే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వివరించారు. నిర్మాత మాత్రం నాతోనే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో నా మార్కెట్‌కు అంత భారీ ప్రాజెక్ట్ సరైన నిర్ణయం కాదని నేను భావించాను. అందుకే నిర్మాతకు వద్దని చెప్పాను అని కిరణ్ తెలిపారు. తర్వాత ఈ కథను సాయి ధరమ్ తేజ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలిసినప్పుడు చాలా ఆనందం కలిగిందని చెప్పారు. దర్శకుడు రోహిత్ ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని, సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేయాలని తానే ప్రోత్సహించినట్లు వెల్లడించారు.
ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తే నాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఉండడు. ఎందుకంటే రోహిత్ టాలెంట్ నాకు బాగా తెలుసు. ఆయనకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కిరణ్ అన్నారు. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాన్ని సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నిరంజన్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కిరణ్ అబ్బవరం చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.