Mandaadi | కోలీవుడ్‌లో ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాల్లో ‘మండాడి’ ఒకటిగా నిలుస్తోంది. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌తోనే మంచి ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా సినిమాలో కనిపించిన అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక విడుదల తర్వాత కూడా ఈ క్రేజ్ క్రమంగా పెరుగుతున్నట్లు బాక్సాఫీస్ బుకింగ్స్ గణాంకాలు సూచిస్తున్నాయి. ‘మండాడి’కి తొలి రోజు తమిళనాడులో మంచి ప్రారంభమే లభించింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ వేదికలో మొదటి రోజున సుమారు 1.20 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. అయితే తెలుగు వెర్షన్ మాత్రం తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో తమిళనాడి మార్కెట్‌పైనే సినిమా ఎక్కువగా ఆధారపడింది.
అయితే రెండో రోజుకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన, మౌత్ టాక్ కారణంగా బుకింగ్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. రెండో రోజున ‘మండాడి’ ఏకంగా 2.40 లక్షల టికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే తొలి రోజుతో పోలిస్తే బుకింగ్స్ దాదాపు రెట్టింపు అయ్యాయి. సాధారణంగా శుక్రవారం పని దినం కావడంతో సినిమాల వసూళ్లు కొంత నెమ్మదిగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ‘మండాడి’ విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పెరుగుదల కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. తొలి రోజు పెద్దగా స్పందన లేని తెలుగు వెర్షన్ రెండో రోజుకు పుంజుకోవడం సినిమాకు సానుకూల సంకేతంగా మారింది.
ఒక సినిమా తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు, అదీ పని దినంలోనూ ఎక్కువగా బుకింగ్స్ సాధిస్తే.. ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అంగీకారం లభిస్తోందని ట్రేడ్ వర్గాలు భావిస్తాయి. ‘మండాడి’ విషయంలో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల్లో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవుతున్నట్లు సమాచారం. ఇది సినిమాకు రాబోయే వారాంతంపై అంచనాలను మరింత పెంచుతోంది. శుక్రవారం వర్కింగ్ డేస్‌లో బుకింగ్స్ పెరిగిన నేపథ్యంలో.. శని, ఆదివారాల్లో ‘మందాడి’ మరింత మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వారాంతంలో కుటుంబ ప్రేక్షకులు, యువత థియేటర్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో సినిమాకు మరింత ఊపు లభించొచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు సోమవారం వినాయక చవితి సందర్భంగా సెలవు ఉండటం కూడా సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బలమైన వసూళ్లు రాబట్టేందుకు ‘మండాడి’కి మంచి అవకాశం లభించింది.