ఖమ్మం సిటీ, మార్చి 14 : ‘వైద్యో నారాయణో హరి’ అన్నారు పెద్దలు. ప్రాణం పోసే వైద్యుడే ప్రత్యక్ష దైవమనేది దానర్థం. ఇది ఒకప్పటి పాత కాలపు వైద్యులకు సరిపోయే మాట. కానీ, ప్రస్తుత కాలంలో వైద్యం పక్కా వ్యాపారంగా మారింది. మానవత్వాన్ని మరిచి, సామాజిక సేవా స్పృహను విడనాడి విజృంభించిపోయింది. ‘ఆసుపత్రిని నెలకొల్పామా! అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తామా!’ అనే ఆలోచనకే అత్యధికమంది వైద్యులు మొగ్గు చూపిస్తున్నారన్నది పచ్చినిజం.
తాము చదివిన వైద్య విద్య లక్ష్యాలకు విరుద్ధంగా ధనార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తమ వద్దకు వచ్చిన వారికి ధైర్యాన్ని నూరిపోయాల్సిన కలియుగ దైవాలు.. లేని భయాలను కల్పించి రూ.కోట్లు కూడబెట్టుకోవడం వైద్యరంగానికే తలవంపులు తెస్తోంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిరాటంకంగా సాగుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
‘కడుపులో ఉబ్బరంగా, నొప్పిగా ఉందని ఓ వ్యక్తి ఖమ్మం నెహ్రూనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అద్దాల మేడను తలపించేలా కనిపించే అతిపెద్ద ఆసుపత్రిలో రోగం ఇట్టే నయమవుతుందని రోగి కుటుంబ సభ్యులు భావించారు. స్థానిక వైద్యులు అడిగినంత ఫీజులు చెల్లించారు. పది రోజులు గడిచిన తర్వాత వైద్యసేవల పేరుతో లక్షలాది రూపాయలు స్వాహా చేసి శవాన్ని చేతిలో పెట్టారు.’
‘వైరల్ ఫీవర్‌తో ఒక వ్యక్తి ఖమ్మం వైరా రోడ్డులోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్లెక్కాడు. గంట తర్వాత లోపలికి పిలిచిన అక్కడి వైద్యుడు రోగితో రెండు నిమిషాలు మాట్లాడి పది రకాల టెస్ట్‌లతో కూడిన ప్రిస్కిప్షన్‌ని అతడి చేతిలో పెట్టాడు. సదరు ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న ల్యాబ్‌కు వెళ్లగా ఫీజు రూపంలో రూ.12 వేలు కట్టించుకున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను తీసుకొని వైద్యుడి వద్దకు వెళ్లగా ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయిందని, మరింత పడిపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పాడు. వెంటనే అడ్మిట్ అవ్వాలన్నాడు. మూడు, నాలుగు రోజుల తర్వాత రూ.50 వేల వరకు బిల్లు చెల్లించి డిశ్చార్జ్ కావాలని సూచించారు.’
ఇదీ.. ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్వాకం. సాధారణ జబ్బులకే వేలు, లక్షల రూపాయలను రోగుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రికి అనుసంధానంగా క్లినికల్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకున్నారు. వీటిల్లో ఎక్కడా కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించరు. తక్కువ వేతనాలు ఇస్తూ అర్హత లేని సిబ్బందితో మనుషుల ప్రాణాలకే లెక్కగడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఎక్కువ మంది సాధారణ జ్వరంతో దవాఖానకు వెళ్లినప్పటికీ స్థానిక వైద్యుడు మొదట రక్త, మూత్ర పరీక్షల ప్రిస్కిప్షన్‌ను చేతిలో పెడతారు.

మరికొందరైతే అవసరం లేకపోయినా స్కానింగ్, ఎక్స్‌రే, ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. వాటన్నింటికీ కలిపి వందలు, వేలల్లో ఫీజులు దండుకుంటూ జేబులు నింపుకోవడం ఆనవాయితీగా మారింది. దగ్గు, జలుబు అయితే తొలుత రక్త పరీక్షలు, ఎక్స్‌రే చేయించుకోవాలి. మూడు రోజులైనా తగ్గకపోతే స్కానింగ్ చేయించుకోవాలంటూ సూచించడం పరిపాటిగా మారింది. వైరల్ ఫీవర్స్ వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించి రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోయాయని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయని రోగులను భయబ్రాంతులకు గురిచేసి మానసికంగా ఒత్తిడి పెంచుతున్నారు.
జిల్లాలో వైద్య వ్యాపారం ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’గా విరాజిల్లుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి పట్టణాలతోపాటు మేజర్ పంచాయతీల్లోనూ జనరల్, మల్టీ స్పెషాలిటీ, పాలీ క్లినిక్‌ల పేరుతో విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారమే దాదాపు 600 పైచిలుకు ప్రైవేట్ దవాఖానాలుండడం గమనార్హం. ఒక్క ఖమ్మం నగరంలోనే 300కు పైగా వివిధ రకాల పేర్లతో కొనసాగుతున్నాయి.
జిల్లావ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఎన్నింటికి అనుమతులున్నాయో, ఎన్ని అక్రమంగా కొనసాగుతున్నాయో ఎవ్వరికీ అంతుచిక్కని విషయం. ఎటువంటి విద్యార్హత లేకపోయినప్పటికీ అనేకమంది యజమానులు వైద్యశాలలను ఏర్పాటు చేసి వైద్యులను నియమించుకొని ఆసుపత్రులు నడిపిస్తున్న విషయం విదితమే. అందరూ కలిసి పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అనే మానవతను మరిచి చిన్నచిన్న కారణాలతో తమ వద్దకు వస్తున్న రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారనేది బహిరంగ రహస్యం. మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చిన్నపాటి రోగానికి కూడా పలు రకాల వైద్య పరీక్షలు చేయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఖమ్మంలో పలు రకాల విభాగాల్లో మేజర్ సర్జరీలు జరుగుతున్నాయి. కార్డియాలజీ విభాగంలో గుండెకు స్టంట్, ఫేస్ మేకర్తోపాటు ఓపెన్ హార్ట్ సర్జరీలు కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు.
మోకీలు మార్పిడి, ల్యాపరోస్కోపిక్ సర్జరీలు, కిడ్నీలకు డయాలసిస్, కిడ్నీల్లో రాళ్లు తొలగించడం వంటి అనేక కీలక సర్జరీలకు ఖమ్మం కేరాఫ్‌గా మారిందని చెప్పొచ్చు. అయితే, ఆయా రోగాలు పేదవాళ్లకు ప్రాణసంకటంగా మారితే, మధ్యతరగతి వర్గాలకు ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం పేరుతో ఒక్కో సర్జరీకి ఒక్కో ప్యాకేజీని ప్రకటించి గుట్టుచప్పుడు కాకుండా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏయే రకాల వైద్యసేవలకు ఎంత ఫీజు తీసుకుంటున్నారో బహిర్గత పరచాలి. అదేవిధంగా ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండే ల్యాబ్‌లలో కూడా ధరల పట్టిక రోగులకు కనిపించేలా పెట్టాలి. కానీ, జిల్లాలో నూటికి తొంభై శాతం ఆసుపత్రుల్లో ఫీజులు, ధరల పట్టికల బోర్డులు ఎక్కడా కనిపించవు. కొందరైతే ఆన్లైన్ పేమెంట్‌కు సైతం అంగీకరించక, కేవలం క్యాష్ పేమెంట్ చేయాలంటూ బలవంతం చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వసతులు లేనందునే ప్రైవేట్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోందనే ప్రచారం జరుగుతోంది.