హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(జాక్టో) డిమాండ్ చేసింది. 12 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరింది. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించింది. జాక్టో సమావేశాన్ని మంగళవారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించారు.
సమావేశం అనంతరం 12 డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎంవో కార్యదర్శి ఎన్ శ్రీధర్‌కు సమర్పించారు. ఈ సమావేశంలో జాక్టో చైర్మన్ జీ సదానందంగౌడ్, సెక్రటరీ జనరల్ కే కృష్ణుడు, కోచైర్మన్ పర్వతి సత్యనారాయణ, హేమచంద్రుడు, జయబాబు, రాములు, అలీం, మల్లికార్జున్‌రెడ్డి, నగేశ్‌యాదవ్, గీతాంజలి, రాజభాను చంద్రప్రకాశ్, నయీం, జుట్టు గజేందర్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్ రద్దుపై కాంగ్రెస్ మ్యానిఫెస్టో చైర్మన్ అయిన మంత్రి డీ శ్రీధర్‌బాబు చొరవ చూపాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) కోరింది. సీపీఎస్ జన జాగరణ యాత్రలో భాగంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు.
సీపీఎస్‌ను రద్దుచేస్తామని.. పాత పింఛన్‌ను పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచి విస్మరించారని, మ్యానిఫెస్టో చైర్మన్‌గా సీపీఎస్ రద్దుకు చొరవ చూపాలని కోరారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యి తక్షణమే సీపీఎస్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, శ్యామ్ సుందర్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.