– అటవీశాఖ అదుపులో ఇద్దరు వ్యక్తులు
– డోజర్ ట్రాక్టర్ స్వాధీనం
బూర్గంపహాడ్, అక్టోబర్ 03 : అటవీ భూమిని అక్రమంగా పోడు సాగులోకి మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకుని డోజర్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సారపాక డీఆర్వో కృష్ణ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అశ్వాపురం రేంజ్ పరిధిలోని కృష్ణసాగర్ ఆర్ఎఫ్ కంపార్ట్మెంట్ నెంబర్ 225 నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బీట్ పరిధిలో చక్కా ఈశ్వరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ కమ్ ఓనర్ ఇనపెంగి నాగరాజులు డోజర్ ట్రాక్టర్‌తో 0.10 హెక్టార్ల విస్తీర్ణంలో 201 క్యూబిక్ మీటర్ల మేర భూమిని ఫ్లవింగ్ చేస్తున్నట్లు గుర్తించి బీట్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న శనివారం అడ్డుకున్నారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ డీఆర్వో కృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన సెక్షన్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆ ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని డోజర్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు.
అటవీ భూములపై అక్రమ ఆక్రమణలు, అనధికార పోడుసాగు, అటవీ భూమి స్వరూపాన్ని మార్చే చర్యలు చట్టప్రకారం నేరమని, ఇలాంటి వ్యక్తులపై అటవీశాఖ చట్టాలను ఉపయోగించి కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అడవిని రక్షించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని, అటవీప్రాంతంలో ఇలాంటి ఆక్రమణలు చట్టరీత్యా నేరమని గుర్తుచేశారు. కృష్ణసాగర్, సారపాక, ఎన్పీ రెడ్డిపాలెం, మోతే పట్టీనగర్ తదితర రేంజ్ పరిధిలో అటవీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం రేంజర్ సత్తార్అలీతో పాటు నాగినేప్రోలు రెడ్డిపాలెం, సారపాక, సందెళ్లపాడు, కృష్ణసాగర్ బీట్ ఆఫీసర్లు లక్ష్మిప్రసన్న, బాబూరావు, బీమ్చంద్, ఉపేందర్ పాల్గొన్నారు.