రాంచీ, ఆగస్టు 11: ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థుల మీద సోమవారం రాంచీలో అమానుషంగా లాఠీచార్జ్ చేయడంతో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ రెండుసార్లు సభను వాయిదా వేశారు. సభ మధ్యలోకి దూసుకువచ్చిన ఎమ్మెల్యేలు.. నిరసన తెలిపిన విద్యార్థులు, ఉద్యోగార్థులపై లాఠీచార్జి చేయడంపై జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పక్ష, వారి భాగస్వామ్య పక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సభ మధ్యలోకి వచ్చి వీరికి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. తొలుత స్పీకర్ రవీంద్రనాథ్ మహతో రెండుసార్లు సభను వాయిదా వేశారు. అనంతరం ఆగస్టు 12 నాటి షెడ్యూల్‌కు ముందే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.