ముంబై: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అక్టోబర్ 2న ముంబైలో నిరసన చేపట్టనుంది. ముంబైలోని శివాజీ పార్క్ గేట్ నంబర్ 6 వద్ద సాయంత్రం ఆందోళన నిర్వహించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. ‘ముంబై చలో.. గద్దార్ జ్ఞాను మస్ట్ గో’ అంటూ సీజేపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా తెలిపారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లు తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై జ్ఞానేశ్ కుమార్ మీడియా, ప్రజల ముందు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నేడు ఇండియా కూటమి భేటీ
‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసేందుకు ఇండియా కూటమి అగ్రనేతలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, చేపట్టాల్సిన ఆందోళనలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించాలని లోక్‌సభ, రాజ్యసభల్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ముసాయిదా నోటీసు సిద్ధంగా ఉందని, బుధవారం సమావేశంలో దానిపై చర్చించి ఆమోదించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, టీఎంసీ నేతలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ(ఎస్సీ) శివసేన(యూబీటీ) తదితర పార్టీల నేతలు సమావేశానికి హాజరుకానున్నారు.
ఈసీ ఆఫీస్ వద్ద లెఫ్ట్ పార్టీల ధర్నా
‘సర్’ ఓటర్ జాబితాల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ లెఫ్ట్ పార్టీల నాయకులు మంగళవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం జనరల్ సెక్రటరీ బేబీ, బృందా కారత్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు సుచేతా డే, శ్వేతా రాజ్ తదితరులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ‘జ్ఞానేశ్ రాజీనామా చేయాలి లేదా ఆయనను తొలగించాలి. ఆయన కొనసాగడానికి మేం ఒప్పుకోం’ అని బేబీ అన్నారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా నిర్బంధించారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ఈసీ పనితీరు, సర్ ప్రక్రియపై అక్టోబర్ 2 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించాయి.
2023 నుంచి ఈసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలి: ప్రకాశ్ రాజ్
కేంద్ర ఎన్నికల సంఘం 2023 నుంచి తీసుకొన్న నిర్ణయాలపై, వాటి పరిణామాలపై దర్యాప్తు కమిటీని నియమించాలని..వాటిని సుప్రీంకోర్టు ముందు ఉంచాలని నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం డిమాండ్ చేశారు. ఒకే విధమైన భావజాలం ఉన్న రాజకీయ పార్టీలు, సంస్థలతో మంగళూరులో ఆయన సమావేశమయ్యారు. ‘సర్ పక్రియ దురుద్దేశంతో నిర్వహిస్తున్నట్టు రుజువైతే, సాక్ష్యాధారాల ఆధారంగా ఆ ప్రక్రియ తర్వాత జరిగిన ఎన్నికలు చెల్లవని సుప్రీం కోర్టు ప్రకటించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. బీజేపీకి ఓటేయని ఓటర్ల పేర్లను తొలగించేందుకే సర్ పక్రియ చేపట్టరేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.