EC vs Rahul Gandhi : ఓటర్ల జాబితా (Voters list) లో అక్రమాలు జరుగుతున్నాయని, అధికార బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీ (Votes theft) కి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం (ECI) తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలను అర్థం పర్థం లేనివిగా అభివర్ణించింది.
రాహుల్‌గాంధీ తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే తన సంతకంతో ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేనిపక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. గురువారం సాయంత్రం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలోనూ అదే వ్యక్తి పేరు ఉండటం, ఉనికిలో లేని చిరునామాలలో ఓటర్లు ఉండటం, ఒకే ఇంటి నంబర్‌పై వందలాది ఓట్లు ఉండటం, ఫొటోలు సరిగా లేని గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం-6 దుర్వినియోగం లాంటి అనేక అవకతవకలను తాము తమ సర్వేలో గుర్తించామని తన ప్రజెంటేషన్‌లో రాహుల్‌గాంధీ వివరించారు.
అదేవిధంగా అధికార బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను తమకు ఇవ్వడానికి నిరాకరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. ‘రాహుల్ గాంధీ తన విశ్లేషణకు, ఈసీపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణ పత్రంపై సంతకం చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఒకవేళ సంతకం చేయకపోతే ఆయన తన విశ్లేషణను నమ్మడం లేదన్నట్టు. అప్పుడు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలి’ అని ఈసీ వర్గాలు స్పష్టం వ్యాఖ్యానించాయి.